పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

మీఁగడ తఱకలు


సంజీవరాయకవి

ఈతఁడు నందవరవంశ్యుఁడు. ఎప్పటివాఁడో యెఱుఁగరాదు. ఏకాదశద్వాదశస్కంధముల నీతcడుగూడఁ దెలిఁగించెను. ఈతని రచనము ప్రశస్తమైనది. హరిభట్టునారయరచనములకంటె మేలయినది. కాని సమగ్రముగా లభింపలేదు.

గంగన

పంచమస్కంధము నీతఁ డొక్కఁడే తెలింగించినాఁడు. ఇది యిప్పుడు భాగవతములో ముద్రిత మయియే యున్నది. ఈతనిరచనము నీరసమయినది.

ఇతర రచనములు

ఇంతవఱకుఁ బోతరాజుగారిభాగవతమున లుప్తభాగములఁ బూరించినవారిఁ గూర్చి పేర్కొంటిని. ఇఁక స్వతంత్రముగా భాగవతములను మరల రచించినవారిఁ బేర్కొందును. ద్వైతవిశిష్టాద్వైతమతముల మూలమునను జైతన్యమతముమూలమునను పోతరాజుగారి భాగవతము బహుప్రచారము గలది గాని యది యద్వైతసిద్ధాంత ప్రతిపాదక మగుటఁ గొందఱ కతృప్తిని గొల్పియుండవచ్చును. ఈకారణమునఁగూడ మటికొందఱు మరల భాగవతమును దెలిఁగించియుందురు.

కోనేరునాథుఁడు

ఈతఁడు కృష్ణరాయలయవసానకాలమందుఁ గలఁడు. బాలభాగవత మనుపేరఁ బద్యరూపముగాను ద్విపదరూపముగాను నీతఁడు రెండు గ్రంథముల రచియించినాఁడు. ఈతని రచనము రసోత్తర మయినది. విశిష్టాద్వైతసిద్ధాంతానుగుణముగా నీతఁడు గ్రంథము రచించెను గాని యనేకస్థలములందుఁ బోతరాజుగారిరచనమును బుడికిపుచ్చుకొన్నాఁడు.