పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/74

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

55


మీఁదఁ బేర్కొనఁబడినవిగాక తంజాపురపు సరస్వతీ భాండాగారమునఁ గొన్ని వచనకావ్యములు గలవు. త్రికామకవి ధేనుమాహాత్మ్యము, పరమానందతీర్థుల బ్రహ్మవిద్యాసుధార్ణవము మఱియు మైరావణచరిత్రము, వివేకచింతామణి, వివేకసారము మొదలగువచనగ్రంథము లచ్చటి పుస్తకసూచియందుఁ గన్పట్టుచున్నవి. ఆ గ్రంథములఁ గూర్చియుఁ దత్కర్తలగూర్చియు దద్గ్రంథములఁ బరిశీలించిన పదపడిగాని తెలుప వలనుపడదు. 17, 18వ శతాబ్దులం దింకను గొన్ని వచనకావ్యములు దక్షిణదేశమున నుప్పతిల్లియుండును.

భారతసావిత్రి, గోవ్యాఘ్రచరిత్రము మొదలగు కొన్ని చిన్ని చిన్ని వచనగ్రంథములను, మనకుటుంబములందు వృద్ధపరంపరగా స్త్రీపురుషులు కంఠపాఠముచేసి భగవద్గీతవోలెఁ బ్రతిదినమును బారాయణము సేయుచుందురు. ఏనాఁ డెవ్వరిచే రచింపబడెనో తెలియరాదు గాని యావచనములు చక్కనికూర్పు గల్గి మధురములై యొప్ప లొల్కుచున్నవి. భారతసావిత్రినుండి యించుక యుదాహరించుచున్నాఁడను.

“సుయోధనా! ఆదరంబుమీఁద నొసంగినశాకమాత్రం బేనియు మనంబున కమృతోపమానంబై చను. భక్తి లేక యిచ్చిన నమృతంబయినను నిస్సారంబై చను. నాపలుకులు వినఁ గలవాఁడ వైతేని నీదురభిమానంబు విడిచి పాండునందనులకు రాజ్యంబు సమభాగంబుగాఁ బంచి యిచ్చి మీరు నూర్వురు వా రేవురుఁ గలసి యేకీభవించి యుండుట కార్యంబు."

ప్రాచ్యలిఖితపుస్తక భాండాగారమున నొండు రెండు శతాబ్దులకు మున్ను దక్షిణదేశమునఁ గేవలవ్యావహారిక భాషలో రచింపఁబడిన వచనగ్రంథములు కొన్ని సేకరింపఁబడియున్నవి. విస్తరభీతిచే వానినిం గూర్చి యిచ్చట ముచ్చటింప మానితిని.

తొంటికాలమున సర్వలోకసామాన్యముగా నర్థ మగుటకై యెంత పండితు లయినను వ్యాఖ్యానాది గ్రంథముల రచియించునప్పుడు కేవలవ్యావహారికభాషనే యుపయోగించుచుండెడివారు. సర్వలక్షణసార