పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

27


కన్నడ గ్రంథము

ఆంధ్రపద్యాత్మకమగు శివతత్త్వసారము విషయ మిట్లుండఁగా నాకు కన్నడమునగూడ నీకృతి గనుగొన నయ్యెను. చెన్నపురిప్రాచ్యలిఖిత పుస్తకశాలలో నేదోకర్ణాటకగ్రంథముతో పాటు, ఆద్యంతశూన్యమై యనామధేయమై కన్నడకందపద్యముల గ్రంథభాగ మొకటి కానవచ్చెను. కన్నడపండితు లాపద్యములఁ జదువుచుండగా వింటిని. తెలుఁగు శివతత్త్వసారపద్యములే యనిపించును. ఆనుపూర్వితోఁ బరిశీలించితిని. తెలుఁగుపద్యములవరుసనే కన్నడపద్యము లున్నవి. తెల్గుకృతిలో మల్లికార్జునపండితారాధ్యుఁడు తనపేర నీక్రిందిపద్యము చెప్పికొన్నాఁడు

క|| ఒండేమి మల్లికార్జున
     పండితుఁ డననుండుకంటెఁ బ్రమథులలో నె
     న్నండొకొ నీయాజ్ఞోన్నతి
     నుండం గాంతు నని కోరుచుండుదు రుద్రా !

ఇట్లే పండితారాధ్యునిపేరనే కన్నడపద్యము నున్నది.

క|| ధరయొళగె మల్లికార్జున
     వరపండిత నెనిసుతి హుదఱిం నిన్నాజ్ఞా
     భరమె సెయల్ ప్రమథరొళా
     నిరలెం దీక్షిసువె నిమ్మ బయసువె నీశా!

ఈ కన్నడకృతినిగూడ పండితారాధ్యుఁడే రచించెనో, మటి యిటీవలివా రెవరైన కన్నడీకరించిరో గుర్తింపవలెను. పండితారాధ్యుఁడు కన్నడమునఁ గూడఁ బండితుఁడయినట్లు పండితారాధ్యచరిత్రమునఁ గలదు. కాన యాతఁడును రచించియుండవచ్చును. ఈ కన్నడగ్రంథమున గ్రంథాదిపద్యములు 183 లోపించినవి. 184 నుండి 491 దాఁక సరిగాఁ బద్యము లున్నవి.