పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/47

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

28

మీఁగడ తఱకలు

తర్వాత 725వ పద్యముననుండి 740వ పద్యముదాఁక గ్రంథము గలదు. ఈ పద్యసంఖ్యనుబట్టి చూడఁగా శివతత్త్వసారము వేయిపద్యముల గ్రంథమయియుండు నని తోఁచుచున్నది. సంస్కృతమున నుద్భటుఁడు 'హరలీల' యని వేయిశ్లోకముల స్తుతిగ్రంథమును రచించెనcట! మన పండితారాధ్యుఁడుగూడ నీవిషయము చెప్పినాఁడు.

క|| హరలీలా స్తవరచనా
     స్థిరనిరుపమభక్తిఁ దనదు దేహముతోడన్
     సురుచిరవిమానమున నీ
     పురమున కుద్బటుఁడు ప్రీతిఁ బోవఁడె రుద్రా !

మఱియు బ్రహ్మదేవకవి యని కర్ణాటకవియు, పాల్కురికి సోమనాథుఁడును నీహరలీలఁ బేర్కొనిరి. ఇది మూకపంచశతి, పాదుకాసహస్రము, లక్ష్మీసహస్రము మొదలగు స్తుతిగ్రంథములఁ బోలినది కాcబోలును. ఉద్భట గ్రంథచ్చాయను మనపండితారాధ్యుఁడు శివస్తుతి రూపముగా వేయి యాంధ్రపద్యములతో నీశివతత్త్వసారము రచించి యుండును. కన్నడ గ్రంథమును పండితారాధ్యుఁడో, మఱి యింకొకఁడో రచించినను తొలుతటి గ్రంథము తెలుఁగు గ్రంథమే యనఁదగిన ట్లున్నది.

క|| మానిసిపైఁ దో ల్గప్పిన
     యీనెపమున నున్న రుద్రు లీశ్వరభక్తుల్
     మానుసులె వారు లోకహి
     తానేకాచారు లీశ్వరాజ్ఞాధారుల్ ||.

క|| మానుషచర్మం పుదుగి
     ర్దీ నెవదిందిప్ప రుద్ర రీశ్వరభక్తర్
     మానుషరె యివరు లోకహి
     తానేకాచార రీశ్వరాజ్ఞాధారర్

క|| స్ఫుటశివతాంత్రికుఁ దపగత
     కుటిలాత్మకుఁ డుద్ధరించు గోత్రము నెల్లన్
     బటుగతి "రజ్ఞః కూపాత్
     ఘటం యథా" యనినసూక్తి కారణ మగుటన్ ||