పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/45

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

మీఁగడ తఱకలు

 నగుటచే, పండితారాధ్యుని గ్రంథములలో శివతత్త్వసారము ముఖ్యమయిన దనవచ్చును. ఇర్వదియేండ్లకు ముందు నరసాపురమున నొకజంగముదేవర యింట దాని నేఁ గనుఁగొంటిని. చెన్న పురిప్రాచ్యలిఖితపుస్తకశాలకు సేకరించితిని. కీర్తిశేషులు శ్రీలక్ష్మణరావుగారు దాని నప్పుడు సాహిత్య పరిషత్పత్రికలోఁ బ్రకటించిరి. తర్వాతఁ బుస్తకముగాను బ్రకటించిరి. కాని యప్పు డాదొరకిన పుస్తకముగూడ నసమగ్రమే. అందు నన్నూట యెనుబది తొమ్మిదిపద్యములు మాత్రమే కలవు. అం దింక నెన్నిపద్యము లుండవలెనో అప్పుడు తెలియ నశక్యమయ్యెను. లక్షణగ్రంథములందు పండితారాధ్యదేవరశివతత్త్వసారములోనివిగా నుదాహృతము లయిన పద్యములు గొన్ని యీముద్రిత గ్రంథమునఁగానరావు. ఆపద్యము లివి

క|| జడ లల్లి భూతి పూయని
     పొడవులఁ బొడగాన మాది పురుషులలోనన్
     నడుమంత్రపు సమయంబులు
     జడమతు లలరించుకొనిరి చంద్రాభరణా!

క|| ఆయెడఁ ద్రిపురాంతకదే
     వా యని పిలుచుటయుఁ గటకమంతయు వినఁగాఁ
     బాయక కిన్నర బ్రహ్మయ
     కోయని యెలుc గీవె తొల్లి యురగాభరణా!

క|| పతి! సదృశాధికతాప
     త్రితయ, గుణత్రితయ, జన్మమృతి సుఖదుఃఖ
     క్షతివృద్ధిబంధమోక్ష
     స్తుతినిందాదులును లేవు ధూర్జటి ! నీకున్||

క|| అంచితమతి నెవ్వరు ని
     ర్మించిరి వంచితులు సురలు కృత్యాదికళా
     భ్యంచితమై తనరారు ప్ర
     పంచము నీయట్ల వరద ! పరమానందా!

ఈ పద్యములఁబట్టి చూడఁగా నింక నెంతో గ్రంథము దొరకవలసియున్న బ్లేర్పడును. ఈపద్యము లిప్పుడు దొరకకున్న గ్రంథభాగములోని వగు ననcదగును.