పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

13


యనియుఁజెప్పు ఛందో వినిహితోక్తిగాన, ప్రాసమైనను యతిపై వడియైన, దేసిగా నిలిపి యాదిప్రాసనియతి, తప్పకుండఁగ ద్విపదలు రచియింతు" నని మాత్రాగణ ఘటిత మగుటచే ద్విపదలో ప్రాసయతి చెల్లు ననుటను సంస్కృతసూత్రములనుగూడ నుదాహరించి చెప్పినాడు. ద్విపదము ప్రాసయతి గలిగియుండుటయు, రెండేసిచరణములకుఁ దునుకలుగాక ద్విపదమునుండి ద్విపదమునకు దూఁకునట్లు పదమధ్య సంధిగలిగి జడవాఱి యుండుటయు శివకవుల కృతులలోనే కానవచ్చును.

మఱియు నన్నయాదుల కృతులలోఁ బ్రాసములందుహల్సామ్యము దప్పక కానవచ్చును. అనఁగా మొదటిచరణము ద్వితీయాక్షరముననెన్ని హల్లులు సంయుక్తములుగా నున్నవో యన్ని సంయుక్తహల్లులును, దక్కిన మూఁడు చరణములందునుగూడఁ బ్రాసస్థానమున నుండును. శివకవు లీనియమము నంతగాఁ బాటింపరైరి. కతిపయ హల్సామ్య మున్నఁ జాలు నని వీరు తలంచిరి. ఒక్కహల్లు హెచ్చోతక్కువో యయినను బ్రాసమును వీరు పరిగ్రహించిరి.

క|| నమ్మినభక్తుఁడు గన్నడ
     బమ్మయ సద్భక్తి మహిమ పరికింపఁగ లో
     కమ్ములఁ జోద్యము గాదె య
     ధర్మంబును ధర్మమయ్యెఁ దత్త్వాతీతా!
                                             -శివతత్త్వసారము

ప్రాఁత వ్రాఁతలలో “ధమ్మ౯" యని యుండును.

   "మర్త్యలోకమునకు మఱి వేఱె యొకఁడు,
     కర్త యున్నాఁడె లోకత్రయవరద, -
     తత్రిపురాంతక స్థానవాస్తవ్యుఁ
     డై త్రిపురాంతకుఁ డభినుతిఁ బేర్చు
                                              -బసవపురాణము.

ఇత్యాదులు పెక్కు లున్నవి.