మీఁగడ తఱకలు
167
ప్రతిమానవునకు "నేను బరతంత్రుఁడనుగా నుండరాదు. స్వతంత్రుఁడను గావలెను" అను నాత్మాభిమానము పొడముచున్నది. ఒకని నిబంధమున కింకొకఁడు లోపడకున్నాఁడు. బ్రాహ్మణుని యాధిక్యమును బ్రతిఘటించుటకు మాలవాఁడును, మహారాజుప్రాభవమును బ్రతిఘటించుటకు దరిద్రుఁడును బ్రయత్నించుచున్నారు. ఈ సంఘర్ష మనివార్యముగా నున్నది. నివారించుట కూడఁ గూడనిపనిగాఁ దలఁపఁబడుచున్నది. దీర్ఘదర్శులు కొందఱు పెద్ద లిందుకై చండాలాదుల యస్పృశ్యతాదులను దొలఁగింపవలె ననియు, దరిద్రులు సంపన్ను లగుటకు వలయు సాధనముల సమకూర్పవలె ననియు సంస్కారములు సేయ సమకట్టు చున్నారు. భాషావిషయమునఁ గూడ నట్టిదే జరుగుచున్నది. కొందఱు పండితులు, కొన్నిభాషాప్రయోజనములనే యుద్దేశించి చేసిన ని బంధములు నిలువరింపరాని వనియు, భాషవలన నంత కంటె హెచ్చు ప్రయోజనము లిప్పుడు పడయవలసినయావశ్యకత యేర్పడుచున్న దనియు, సర్వమానవసంఘమును భాషాప్రయోజన సర్వస్వమును సమముగాఁ బడయవలసి యున్న దనియు, నందులకై వాడుకభాషను గ్రంథరచనము జరుగవలె ననియు వాదించుచున్నారు. అట్లు గ్రంథ రచనములు చేయుచున్నారు. నేనును నట్టి సంస్కారము నభిమానించిన వారిలో నొక్కఁడను. కాని దానిఁగూర్చి యిటీవల నా యభిప్రాయము మఱింత విపులముగా విరిసి దిక్కు దోఁచనిదిగా నున్నది.
ఇదివఱకు మేము కొందఱము సంకల్పించినసంస్కారములు సంకుచితభావములు గలవిగా నే నిప్పడు తలఁచుచున్నాను. ఏలనఁగా, “వచ్చుచున్నాను" అను శబ్దరూపమువలెనే "వస్తున్నాను" అనురూపము కూడఁ బ్రాజ్ఞవ్యవహారమందుఁగలదు గనుక ప్రయోగార్హ మని యంగీకరింపఁదగు నంటిమి. కాని ప్రస్తుతకాలపరిణామమునఁ జూడఁగాఁ బ్రాజ్ఞ సంఘ మిది యని వేఱుపఱుచుట కిఁక వీలు కలుగనట్టున్నది. సర్వమానవసంఘమందును విద్యావిజ్ఞానములు విపులముగా వెలయు చున్నవి. అహమిక నిండారుచున్నది. బ్రాహ్మణాదుల వ్యవహారమందుఁ గల ‘వస్తున్నాడు' ప్రయోగార్హమయినప్పుడు చండాలాదుల 'వస్తుండాడు' మొదలగు రూపములు ప్రయోగార్షము లేల కావు? బ్రాహ్మణుల యాధిక్యమును జండాలురు వెన్నాడకున్నప్పుడు వారి భాషా ప్రయోగరీతిని