పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

166

మీఁగడ తఱకలు


మయిన యర్హత సమ్మానము ప్రాచీన కాలమునం దెట్లేర్పడలేదో యట్లే వారివారి భాషలకును భాషాప్రయోజనములకును సమాన మయిన సమ్మానము, అర్హత కలుగదయ్యెను. ఇది సర్వలోక సర్వభాషాసామాన్య మయినవిషయమే.

ప్రస్తుత మగుటచే నిట మన తెనుఁగునాటిమాట తీసికొనుచున్నాను. ఇతరులచేఁ బ్రాజ్ఞు లని సత్కరింపఁబడినవారు, ఇతరులను దమ నిర్ణయము చొప్పున వినిపింపఁగల్గినవారు ఎవరో కొంద ఱాయాకాలములయం దేవో కొన్ని ఛందోవ్యాకరణాదివిధుల నేర్పఱచి, యా విధులచొప్పున గ్రంథరచనాదికము జరుగవలె నని నిబంధములు గల్పించుచు వచ్చిరి. అధమగతి నున్న తక్కినలోకము వారినిర్ణయములను గొన్ని ప్రయోజనము లందుఁగొంతకొంత పాటించుచు వారిని వెంటాడుచు వచ్చిరి. దేశకాల పాత్రములనుబట్టి యానిర్ణయములును మాఱుచు వచ్చినవి. మఱియు నిట్లింతకాలమువఱకు నా భాషాలక్షణ నియామకులు తమకుఁ బరిచిత మయినజనసంఘమును బ్రయోజనములను మాత్రమే లక్ష్యముగాఁ జూచుకొని నిబంధములఁ జేయుచువచ్చిరి. కాని యా భాష ప్రచారము గాంచినసర్వమానవసంఘమునుగూర్చియు భాషవలన వారివారికిం గలుగవలసినసర్వప్రయోజనములనుగూర్చియుఁ, జర్చించి, సర్వార్ధసాధక మగునట్లు నిబంధముల నేర్పఱిచినవారు కారు. కావ్యాలంకారచూడా మణికారునినుండి బాలవ్యాకరణకారునిదాఁకఁగలపండితులు చేసిననిబంధము లాంధ్రదేశమందలి పరిమిత మానవ సంఘమునకుఁ బరిమితభాషాప్రయోజన మైనకావ్యానంద మునకుమాత్రమే కొంత చాలియున్నవి. ఇంతదాఁకఁ గడచిన కాలముతీరు వేఱు. నేcటి కాలముతీరు వేఱు. పూర్వమువారు తలఁచి యైన నెఱుఁగనియావశ్యకత లెన్నో యీనాఁటివారికిఁ గల్గుచున్నవి. పూర్వమువారు మానవులుగాc గూడ గణింపనివా రెందఱో యిప్పుడు మహనీయు లగుచున్నారు. ఇట్టి స్థితిలోఁ బ్రాచీనుల నిబంధము లీకాలమునఁ బనికిఁజాలనివి, పనికి మాలినవి యగుచున్నవి. భాషావిషయముననే కాక సర్వవిషయములందు నిట్టిసంఘర్షమే సంఘటిల్లినది. నేఁ డొకయద్భుతశక్తి యఖిలప్రపంచము నావహించినది. భారతదేశము నది బలముగా నలముకొన్నది.