168
మీఁగడ తఱకలు
మాత్ర మేల వెంటాడుదురు? ‘మా సంఘవ్యవహారమున నున్నరూపమునే మేము మా గ్రంథములం దుపయోగించుకొందు' మందు రేని "వస్తునారు" మాత్రమే ప్రయోగార్హమని తలంచువా రేమి బదులు చెప్పఁగల్గుదురు. ఇట్టి రూపములే ప్రయోగార్షము లని విధించుటకు వీరి కేమి యధికార మున్నది? నాకు నేనయి యింతవఱకు మాత్రమే సంస్కార మంగీకరించ దగు నని నిబంధింపఁ బూనితి నేని యా నిబంధమునకు లోఁబడువా రెవ్వరు? ఇట్టి చిక్కుభాషావిషయముననే కాక, సర్వవిషయములందును గూడ సంఘటిల్లినది. సాంఘికరాజకీయవిషయములందు--- సంస్కారములు మహాత్ములకుఁగూడఁ గొఱుకఁబడనివిగా నున్నవి. ఈ చిక్కుయొక్క పరమావధి యే మనఁగా ఒక్కొక్క మనుష్యుఁడును "నా భాషను నేను వ్రాయుదును. ఇంకొకరి నిబంధము నాకు విధాయకము గాదు. 'అన్నంతవఱకుఁ బోవచ్చును. కాని యట్టి సంఘర్షమునఁ జిదికిపోయెడిచింతనము లేవో బ్రదుకగల్గెడిభావము లేవో వీని పరిణామ మెట్టి దగునో నా యల్పబుద్ధికి గోచరము గాకున్నది. నేఁడు భాషా సంస్కారము నపేక్షించి చర్చించువారిలోఁగూడ నైకకంఠ్యము లేదు. “చూచినాడు, చూచాడు, చూసినాడు, చూశినాడు, చూశాడు, చూసేడు" అని యిన్నిరూపములును వ్రాయువా రున్నారు. ఇందుఁ గొన్నియే పరిగ్రాహ్యము లని వ్యవస్థాపించి యాఁచి పట్టుట కధికారులు లేరు. సంస్కారమే పనికిరా దని యడ్డుపెట్టుట కంతకంటె నధికారులు లేరు. ఆ సంస్కార మనివార్యముగా జరుగుచునే యున్నది. అయ్యో! ఎంత భయంకర మైనచిక్కు ఇట్టి చి క్కొక్క భాషావిషయమందేకాక సర్వ విషయములయందు సంప్రాప్త మయినదిగదా! మానవమాత్రుఁడు ప్రాభవముచేఁగాని, ప్రజ్ఞచేఁగాని యిఁక మీఁదికాలమున లోకమున నేవిషయముగాని యనుశాసింపఁజాలఁడేమో యని నాసంశయము. భగవంతుఁ డొకఁ డుండెనేని లోకమును బరమానందోద్దేశమునకుఁ జేర్చుటే తదుద్దేశమేని, యాయన కల్యాణమార్గ మేదో లోకమునకుఁ గల్పింపఁగలఁడు. అది యేదో యందువఱకును మనప్రయత్నములు గ్రుడ్డియెద్దు చేనఁ బడినలాగున సాగుచుండవలసినవే కాఁబోలును! అట్టి శుభసమయము లోకమునకు లభించు టెప్పడో!