పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/184

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది15

వాఙ్మయపరిణామము

శా|| భాషాదేవత సుస్వరూప మది విస్పష్టంబుగాఁ గానరా;
      దీషద్‌జ్ఞానమ యెల్ల వారికిని, మా కీనాఁడు బహ్వర్ధముల్
      భాషింపన్ వలసెన్, నిబంధముల నిర్బంధం బసంబద్ధ మన్
      ఘోషం బేర్చడె; మార్పు తప్ప, దిట లగ్గుం గూర్పు మోయీశ్వరా!

పండితులదగ్గఱనుండి పామరులదాఁకఁ, బుట్టిననాఁటినుండి గిట్టిననాఁటిదాఁక నెల్లరకును, నెల్లపుడును లోకప్రవృత్తికి భాష పరమోపకారము; అత్యావశ్యకము. కాని చిత్తసంస్కారములలో నావశ్యకతలలో రుచులలో నర్హతలలో భిన్నలక్షణము లుండుటనుబట్టి వారివారిభాషలు కూడ భిన్నలక్షణములతోనే యుండును. పండితులభాష వేఱు; పామరులభాష వేఱు; బాలురభాష వేఱు; ప్రౌఢులభాష వేఱు. వారువారు వారి వారి భాషలలోఁ దమతమ యవసరములను దీర్చుకొనుచుందురు. పండితునకు రామకథ భవభూత్యాదిప్రౌఢకవినాటకములచే దర్శనీయము కాఁగాఁ బామరునకుఁ దోలుబొమ్మలాటచే దర్శనీయ మయ్యెను. పండితుఁడు తిక్కనభారతము చదివి భారతకథ తెలిసికోఁగాఁ బామరుఁడు "హరిహరీ నారాయణాదినారాయణా" మట్టు పదములు మొదలైనవి చదివి దానిని దెలిసికొనును. పండితుఁడు “వచ్చుచున్నా"నని "వస్తున్నా"నని యనఁగాఁ బామరుఁడు “వస్తుండాను" "వత్తుండాను" అని యనును. వారి రుచులు వేఱు; వీరి రుచులు వేఱు గదా! ఇట్లు భేదపరమావధులను జూపఁబూనినచో నొక్కొక్కని కొక్కొక్క తీరుభాష యున్న దన్నంతవఱకుఁ జూపవచ్చును. ఇందులో నెవ్వరు గాని సంఘమునుండి యెట్లు తొలఁగింప రానివారుగా నుందురో యట్లే వారిభాషయు నపరిహార్యమే యగును. కాని యింతవఱకుఁ గడచి చన్నకాలమం దట్లు జరుగలేదు. ఉన్నతసంఘములవారి యుత్కృష్టభాషయుఁ దత్ప్రయోజనములును, గొంతకొంత పరిరక్షింపఁ బడినవి గాని యధమసంఘములవారి యవనతభాషయు వారి భాషాప్రయోజనములును బరిరక్షింపఁబడలేదు. అందఱకు సమాన