పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

మీఁగడ తఱకలు


గొంతపంట పండెను. ఈభక్తబ్రాహ్మణుని ననుసరించి యూరివా రయిదుగు రారెడ్డిని యాచింపఁ బయనమైరి. ఈ బ్రాహ్మణుఁడును బయనమయ్యెను గాని రక్షకుఁడు భగవంతుఁ డనుచు బాటలోఁ బాటలు సాగించెను. ఇసుకయేటిలో నడక - మట్టమధ్యాహ్నము మండుటెండ - ప్రాణాపాయ స్థితిలో నందఱు నుండిరి. చింపిరిబట్టలు కాళ్లకుఁ జుట్టుకొనికూడ నిలువను నడుగు సాగింపను జాలకుండిరి. నోళ్లు పిడుచ కట్టుకొని పోవుచుండెను. ఇట్టిచోఁ గొన్నిగజముల దూరమున, జీబుకొన్న చిగురాకు జొంపములతో నిండారిననీడతో నొక గొప్పవృక్షము గాన వచ్చెను. భక్తబ్రాహ్మణుఁడు దానిని జూచి తనిసి యటు చేరఁబోవుద మనెను. అం దొకఁడు మనకనులు తిరిగి మతిచెడి యట్టు చెట్టుగానవచ్చినది. నే నెఱుఁగుదును. ఇక్కడ చెట్టెన్నఁడును లేదు. చావో బ్రదుకో నేను మీఁ దియూరికే యడుగు సాగించెద నని బండతనముతో నడువసాగెను. కడమవారు కళవళపడసాగిరి. భక్తుఁడు నేను ముందు చేరఁబోయి నిజ మయినచో మిమ్మఁ గేక వేసి పిలుతును రండని చెట్టును జేర నడచెను. చల్లనినీడచె ట్టాతని కుల్లాసము గొల్పెను. కడమవారు ముగ్గురు నాయన పిలుపునఁ జేరఁజనిరి. అందొకఁడు మాయో నిజమో చల్లనినీడ దొరకినది. నోరు పిడుచ కట్టుకొని పోవుచున్నది. స్వామీ! చెట్టునీడ నిప్పించినట్టు నీరుకూడ నిప్పింపుఁడు అనెను. భక్తుఁడు ప్రార్థించెను. అంత నా చెట్టు చిగురుజొంపముల నుండి చల్లని తియ్యనీరు చెంబులతోఁ బోసినట్లు ధారలుగా జారసాగెను. కనులు మొగము కడుగుకొని కడుపాఱ వాచాఱతో నీరు ద్రావి తల యొడలు కాళ్లు గడిగికొని హాయి హాయి మని యందఱు నానందించిరి. ఇదేమి వింతో అనిరి! ఒకఁ డిట్లనెను. “మండుటెండలలోను, బాడుగుళ్లలోను, నీరులేని పాడునదులలోను దేవతలో పిశాచములో విహరించుచుందు రందురు. వా రెన్ని వింతలయినఁ గొంతకాలము చేయఁగలరు. ఇదేదో అట్టివారి పని. ఏదైనఁ గానిండు. ఇది మాయము కాకముందే మన మంచి జరుపుకోవలెను.