పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/137

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

మీఁగడ తఱకలు

ప్రవరుని మర్యాద, వరూధిని కోరిక, గంధర్వుని బులుపాటము దక్కినది గదా! ఆ మువ్వరి హృదయములలో నెవ్వరి హృదయములోను కలుగని రోఁత మీ కేల కలుగవలెనండీ! అని.

రసానుభూతి కథాశ్రోతలకుc బ్రేక్షకులకు సంబంధించినది గాని కథాపాత్రలకు సంబంధించినది గాదు.

వరూధినికి వాఁడు వేషధారి యయినగంధర్వుఁ డను సంగతి తెలియదు గాని మనకుఁ దెలియును. కనుక యిది రసాభాసమే. రసాభాసమే కాదు-నేటి శిక్షాస్మృతిప్రకారము కొన్నియేండ్ల శిక్షకుఁ దగిన క్రిమినల్ కేసుకూడ!

గంధర్వుఁడు కొన్నాళ్ల తరువాత రహస్యము వెల్లడించి వరూధినిచే మెప్పు పొంది సత్కృతుఁ డయినాఁ డనియే సరి పుచ్చుకోవలెను. లేనిచో రసాభాసమే! కథావిధాన మంతయు రోఁతయే!

గంధర్వుఁ డిట్లు తనమాయాకృత్యము వరూధిని ముందఱ వెల్లడించుట సంభవించుచో దాని కామె మెచ్చుకొనుట తటస్థింప దేమో యనెడిసందియము పొడముట సహజమే! ఆమె నిజమునకు ప్రవరునే ప్రేమించినది గాని, యానాళ్లలో గంధర్వునిఁ బ్రేమింపలేదు. ఆమె మృచ్ఛకటికలోని వసంతసేననలె గుణానుకరక్తగఁ బ్రేమించినది.

ఇచట వరూధిని ప్రవరునిఁ బ్రేమించిననాళ్లలోఁ దదేకానురక్తగాఁ బతివ్రతగానే వర్తిల్లినది. అయినను నామె మాయా ప్రవరుఁడు మాయమైన తరువాత ధర్మశాస్త్రప్రకారము పండ్రెండేండ్లు ప్రతీక్షించి యాపై భర్తకు శ్రాద్ధము చేసి, కలకాలము విధవగనే యుండిపోయిన దనుకొనుట సరికాదు.