పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

117

ప్రవరుఁడు గురువులయొద్ద నేర్చినసదాచారసంపదను నిలువఁ ద్రొక్కుకొనినాఁడు. ఆమెచేష్టలకు చీదరించుకొనినాఁడు. బదుళ్లు చెప్పినాఁడు. కౌగలింపగా శ్రీహరీ యని యోరమోమిడి తదీయాంసద్వయం బంటి పో పొ మ్మంచుం దొలఁగఁ ద్రోచినాఁడు “అనయా యావజ్జీవం హోష్యామి" అను మాట దక్కించుకొనినాఁడు. తన బ్రహ్మ వర్చసమును ప్రజ్వలింపించుకొనినాఁడు. అగ్నిదేవుని నారాధించి, ప్రార్ధించి, యూ యజ్ఞేశ్వరుని యనుగ్రహముతో నాకాశమార్గమున నెగసి యరుణాస్పద పురమునకు వెళ్లిపోయినాఁడు.

వరూధినికిఁ దగిన పరాభవ మయినది. గంధర్వునికిఁ దనవలనఁ గలిగినయవమానమే ప్రవరునివలనఁ దనకు దాపురించినది. పొంచి గుర్తించుచుండినగంధర్వుఁ డిదే యద ననుకొని ప్రవరవేషమునఁ దయారయి వరూధినిని దక్కఁగొన్నాఁడు. ఈ వేశ్యావిషయికరతిలోని చమత్కారవిశేషమును గుర్తింపఁ జాలనిచో వరూధినీకథాసారస్యముఁ దెలియఁజాలము. వేశ్యలును, దదాసక్తులు నయిననాయికానాయకులు పరస్పర మొకరికొకరు వశులు కానిచో దబ్బఱలు, తాటోటులు, తబ్బిబ్బులు జరపి, మోసాలు చేసి, వేషాలు వేసి కార్యము సాధించుకొనుచుందురు. నాయికానాయకులు పొంది పొసఁగుట జరిగిన పిదప తొల్తటి దుష్కృత్యములు రసాభాసములు ప్రజ్ఞాప్రయోగములుగను, - రసోత్కర్షాదా యకములుగను మారి సామాజికులలో రససిద్ధిని గల్గించును. ఈ పద్ధతినే గంధర్వుని నడవడి యిచట సమర్థనీయము కాఁగలదు. కాని యిట్లు సమర్ధించుటకు గంధర్వుఁడు తన ప్రజ్ఞాప్రయోగములను వరూధినికిఁ దెలియఁ జెప్పి మెప్పుపొందు టత్యావశ్యకము.

ప్రేమలేనివరూధినిని దొంగవేషము వేసికొని, గంధర్వుఁడు కలసినట్లు కాదు-చెఱచినట్లు వర్ణించుట రోఁత! కాని కొందఱు సహృదయు లీవిషయమున నిట్లనవచ్చును.