పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/135

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

116

మీఁగడ తఱకలు

వరూధిని పురుషముఖ మెఱుగని, వివాహితగాని భారతీయార్యకుల నారీరత్నము కాదుసుమండీ! ఆమె సదా ముప్పదేండ్ల వయస్సుదే! కనుక ప్రస్తుతకథాసందర్భమునకు ముం దెందఱినో గంధర్వవిద్యాధరాది దివ్యపురుషులను, భువినుండి దివికి విచ్చేసిన శ్రోత్రియులను, వినోదపఱచి వారితో వినోదించినదే! మర్త్యలోకపు, మర్త్యవేషపు శ్రోత్రియులమీఁద మక్కువ రేగినదో యేమో! హిమాలయ పర్వతాగ్రమున ఠేవిణి వేసియున్నది. హిమాలయము భూలోక స్వర్గలోకముల సంధానస్థలము. దేవయోనుల కక్కడ దేవభూము లెన్నియో యున్నవి. వేడ్క పుట్టినప్పు డెల్ల దివ్యు లచట విడిసి విహరించుచుందురు. మన పెద్దలకు కొడైక్మానల్ ఊటీ సిమ్లాలలో నెట్టి సౌఖ్యపరికరము లుండునో యట్టివే వీరికిని అచట గలవు. ఆ పర్వతాగ్రముల కప్పుడప్పుడు సిద్ధపురుషులు, మహాయోగులు మొదలగువారు, భూలోకవాసులును వెళ్లఁగలుగుచుందురు.

గ్రహచారము చాలియో చాలకయో యార్యావర్తమున నెచ్చటనో యున్నయరుణాస్పదపుర వాస్తవ్యుఁ డొకఁడు శ్రోత్రియబ్రాహ్మణకుమారుఁడు, ప్రవరాఖ్యుడు పాదలేపము లభింపఁగనే వెనుకముందులు చూచుకొనక, ఫ్రీ టిక్కట్లు దొఱికినదే తడవుగా రైలుప్రయాణమునకు సిద్ధపడు నాత్రగాని వలె, హిమాలయమును దర్శింపఁ బోయినాడు! పాదలేపము కరఁగి పోఁగా నప్రయోజకుఁడై దిగుల్పడుచు వరూధిని యుండిన కోనలోని కేగినాఁడు.

వరూధినికి వంటయింటిలోఁ గుందేలు చిక్కినట్లైనది. ఆకలి గొన్నమాంసాహారి వంటయింటి కుందేటిని విడువనట్లే వరూధిని ప్రవరుని వలపుఁజూపుల వలలోఁ జిక్కించుకొని దక్కించుకోఁ దంటాలు పడినది. తన వలపుపొలుపులు దులపరించినది తుటారించినది. ఆదరించినది. బెదిరించినది. ప్రార్ధించినది. పైఁబడినది. కౌగిలిపట్టుగఁ బట్టుకొనినది. వెన్నతోఁ దినిన విద్య నంతయుఁ గ్రక్కినది. వెక్కివెక్కి యేడ్చినది. ఏమి చేసినను నెంత యేడ్చినను లాభము లేకపోయెను.