పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/129

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

మీఁగడ తఱకలు


నుద్దృతము లయినవి. వాని నాగ్రంథమునఁ జూడఁదగును. ఇవి గాక పాండురంగవిజయ మని మఱియేమో అని యీకవికృతు లున్నట్లు కొందఱు పేర్కొందురుగాని వానివిషయము నమ్మఁదగినది గాదు.

కథలు

తెనాలిరామలింగనికథ లని దక్షిణహిందూదేశమెల్లఁ బ్రఖ్యాతికెక్కి పెక్కుకథ లున్నవి. వానిగూర్చి మన మేమియుఁ జెప్పఁజాలము, అతఁడు హాస్యచతురుఁడై యుండవచ్చును. నిజముగాఁ గొన్నికథ లాతనికి సంబంధించినవే కావచ్చును. లోకులు మఱియు ననేకాద్భుతకథ లాతని తలకుఁ దగిలించియు నుందురు. పెక్కుకథలు శ్రీకృష్ణదేవరాయల గోష్ఠిలో జరిగినవిగా వినవచ్చును. రామలింగఁడు రాయల సమకాలము వాఁడే, కావున నవి సంభావ్యములుగావచ్చును. చాటుపద్యమణిమంజరిలో నాతని కథలకు సంబంధించిన చాటుధారలఁ గొన్నిటిని జేర్చినాఁడను. క్రొత్త దొక్కటి యిక్కడ చూపుచున్నాడను.

క|| ఓయమ్మలార! మందులు
     వేయేల మకారకొమ్ము విషకవిగానిన్
     వాయెత్తకుండఁ జేసిన
     వాయెత్తదు రామరాయవసుధేశునకున్

అళియరామరాయనికి వాయురోగము వచ్చెనఁట! అంతఃపుర స్త్రీ లాతనికి మందుల నిప్పింపఁ దంటాలు పడుచుండగా రామలింగఁ డీపద్యమును జెప్పినాఁడఁట. మకారకొమ్ము విషకవిగాఁ డనఁగా మూర్తికవి. ఆతని వాయి = నోరు, ఎత్తకుండఁజేసినచో రామరాయలకు వాయి = వాయురోగము, తలచూప దని పద్యార్ధము. మూర్తికవి విషకవిత్వ ప్రయోగముచే రాయలకు రోగమువచ్చె నని స్త్రీలను నమ్మించి యాతని యుద్యోగవైభవము నూడఁగొట్టించుట కెత్తిన యెత్తుగాcబోలునిది!