పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మీఁగడ తఱకలు

109


సీ|| శ్రీరామసేవాప్రసిద్ధుఁ గాశ్యపగోత్రు
               శుభదకాత్యాయనసూత్రపాత్రు
      లలితచారిత్రుఁ గాళయమంత్రికిని గోన
               మకును దౌహిత్రు సర్వకవిపౌత్రు
      తిరుమలాంబాగర్భవరవార్ధి పూర్ణేందు
               ధన్యాత్ము లక్ష్మప్రధానపుత్రు
      నిజపాలకజనకనిష్ఠాగరిష్ఠ రా
               మసచివలబ్ద రామజపధుర్య

గీ|| రామకృష్ణాఖ్యు జామాతఁ బ్రకటవిభవు
     శుక్లయజురధ్యయనుఁ బేర సూరిమాచ
     యానుజునిఁ దిమ్మధేనిధి కగ్రజాతు
     ననఘు లింగమకుంట రామార్యునన్ను.[1]

ఇట్లు అల్లు డగురామకవియుఁ, బూర్వోదాహృత పద్యమున మనుమఁ డగురామభద్రకవియు, రామకృష్ణ నామము పేర్కొనుటకు వారు వైష్ణవమతమం దెక్కువగా నభినివేశముగలవా రగుట కారణము గావచ్చును. వారికి వైష్ణవమతాభినివేశ మాయాగ్రంథములఁ జూడవచ్చును.

మఱికొన్ని కృతులు

తెనాలి రామలింగనికృతులు మఱిరెండు తెలియవచ్చుచున్నవి. వానిపేళ్లు కందర్పకేతువిలాసము, హరిలీలావిలాసము. ఆప్రబంధము లిప్పుడు కానరావుగాని, వానినుండి కొన్నిపద్యములు ప్రబంధరత్నావళిలో

  1. ఆనందకానన మాహాత్మ్యములో 'నిజపాలకజనక' అనుచోట 'నిజజనకాగ్రజ' అనియున్నది. దీనిచే నాతఁడు తనపెద్దతండ్రికి దత్తుఁడయ్యెనని తెలియనగును. లింగమకుంట రామకవి తెనాలి రామకృష్ణకవి యల్లుఁడని లింగమకుంటవా రెల్లరు నేఁటికిని జెప్పుచున్నారు. నేఁడు లింగమ కుంటవారి యల్లురగు శ్రీకొండ వెంకటప్పయ్యపంతులుగారివల్ల తొల్త నిది విని తర్వాత లింగమకుంటలో విచారించి రామకవికృతుల సంపాదించి యందును జూచి, నే నిది తధ్యమని నమ్మితిని.