పుట:Meegrada Tarakalu Sri Veturi Prabhakarasastri 2008 188 P 5010010082711.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

 శ్రీశాస్త్రిగారు మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో చాలాకాలం పరిశోధకులుగా ఉండి, అనేక అముద్రిత తాళపత్రగ్రంథాలను వెలుగులోనికి తెచ్చారు. ఎన్నో గ్రంథాలు పరిష్కరించి, పీఠికలు సంతరించారు. వీరి పీఠికలు గ్రంథహృదయాన్నీ కవి ఆశయాన్నీ ఆవిష్కరిస్తాయి. మొగమోటం కోసం అంతా బాగుం దనే పద్ధతిలో కాకుండా వీరి విమర్శనధోరణి నిష్పాక్షికంగా, హేతుబద్ధంగా, ప్రామాణికంగా, సహృదయరంజకంగా ఉంటుంది,

అన్నమయ్య సంకీర్తనల విషయంలోనూ, తాళపత్ర గ్రంథాల సేకరణ, పరిరక్షణలోనూ, ప్రాచీనశిల్పసంపదను ఒక్కచోట చేర్చి, 'మ్యూజియం' స్థాపించడంలోనూ, "మాస్టర్.సి.వి.వి" యోగంద్వారా వ్యాధుల్ని నయం చేయడంలోనూ శ్రీశాస్త్రిగారినిర్విరామకృషి మహత్తరమైనది.

శ్రీశాస్త్రిగారి 120వ జయంతి (07.02.2008) సందర్భంగా - వీరి అలభ్యరచనలను “1) ప్రజ్ఞాప్రభాకరము, 2) సింహావలోకనము, 3) తెలుగుమెఱుగులు 4) మీగడతఱకలు" అనే నాల్గింటిని పునర్ముద్రించి, సహృదయసాహితీప్రియులకు అందిస్తున్నాము. ఇందలి వ్యాసాలు సాహిత్యానికే గాక, యోగాదివిషయాలకూ, సద్విమర్శనచింతనకూ, ఆటపట్టులు. ఇలాంటి రచనలు చదివి, జీర్ణించుకోవడం ద్వారా సాహితీప్రియులు ప్రాచీన సాహిత్యాభిలాషనూ, విమర్శనశక్తినీ, కవితానురక్తినీ, పటిష్టం చేసుకోవచ్చు.

తిరుమల తిరుపతి దేవస్థానంవారు చేస్తున్న ఈ వాఙ్మయసేవను సాహితీహృదయు లందరూ సద్వినియోగపరచుకోవాలని ఆశిస్తున్నాము.

శ్రీవేంకటేశాయ మంగళమ్

శ్రీవారి సేవలో,

(కె.వి. రమణాచారి)