పుట:Matamu-Pathamu.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భగవద్గీతలో నేడు క్రైస్తవమతములోను, ఇస్లామ్‌మతములోను చెప్పిన సారాంశము గలదు. అందువలన గీతకు పవిత్ర పరిశుద్ద అను రెండు బిరుదులు గలవు. భగవద్గీత భూమివిూదనున్న ఏ మతము పేరుతోను చెప్పబడియుండలేదు మరియు దైవసంబంధమైన పరమును గురించి మాత్రమే బోధించినది. కావున దానికి పరమ అని బిరుదు మొదటనే కలదు. భగవద్గీత పరమును (దైవమును) చూపునది, జ్ఞానపవిత్రతను కలిగియున్నది మరియు కర్మయను మురికిని తొలగించునదైయున్నది. అందువలన గీతను పరమ పవిత్ర పరిశుద్ద గ్రంథమని ద్వాపరయుగముకంటే ముందే కృతయుగములోనే అనెడివారు. భూమివిూద ఆ కాలములో అందరు జ్ఞానము తెలిసిన వారుండెడివారు. మాయ ప్రభావము చేత కొంత కాలమునకు మనుషులు దైవజ్ఞానమునకు దూరమైపోతూ వచ్చారు. ఆ విధముగా మనుషులు అజ్ఞానమువైపు పోతూ పోతూ భగవద్గీతకు గల బిరుదులను మరిచిపోయారు. అంతేకాక చివరకు భగవద్గీతనే మరచిపోయారు. గీతలోని ధర్మములను పూర్తి మరచిపోయారు. ద్వాపర యోగము (యుగము) చివరలో ధర్మములకు పూర్తి గ్లాని ఏర్పడినది. అటువంటి సందర్భములో దేవుడు మనిషిగా పుట్టి శ్రీకృష్ణునిగా ప్రవర్తించి సమయమును చూచి గీతను తిరిగి చెప్పిపోయాడు. ద్వాపరయోగము చివరిలో చెప్పబడిన భగవద్గీత కలియోగము మొదటికాలమైన ప్రస్తుత కాలములో ఉన్నప్పటికి దానికి బిరుదులు ఏమాత్రము లేకుండా పోయాయి. వెనక కలియోగములో పుట్టిన బైబిలుకు పరిశుద్ద గ్రంథమనీ, దానికంటే ఎంతో వెనుక పుట్టిన ఖురాన్‌ను పవిత్రగ్రంథమని పిలుస్తున్నపుడు, ఎంతో ముందు పుట్టిన భగవద్గీతను ఏ బిరుదుతో పిలువకపోవడము వలన గీతలోని జ్ఞానమునే చిన్నబుచ్చినట్లవుతుంది. బైబిలు, ఖురాన్‌ గ్రంథములకంటే ముందు చెప్పబడిన గీతజ్ఞానము అన్ని రకముల పవిత్రమైనది పరిశుద్దమైనది.