పుట:Matamu-Pathamu.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీనికి నిదర్శనముగా గీతలోనే జ్ఞానయోగమను అధ్యాయములో 38వ శ్లోకములో "నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే" అని చెప్పియున్నారు. దాని అర్థమును క్లుప్తముగా చెప్పుకొంటే గీతలో చెప్పిన జ్ఞానమునకు సమానమైనదిగానీ, దానికంటే పవిత్రమైనదికానీ లేదని తెలియుచున్నది. ఇదే జ్ఞానము ఇతర మతగ్రంథములలో ఉన్నది. ఇదే జ్ఞానము కొంత శాతమున్న గ్రంథములకు పవిత్ర అనీ, పరిశుద్ద అని బిరుదులు పెట్టినపుడు, పూర్తి శాతము జ్ఞానమున్న భగవద్గీతను చెప్పునపుడు దాని గొప్పతనమును సూచించకుండ, ఏ బిరుదులు లేకుండ పిలువడము భావ్యముకాదు. కనుక మనము ఇప్పటినుండి భగవద్గీతను నిజమైన భావముతో పరమ, పవిత్ర, పరిశుద్ద భగవద్గీత అని పిలుస్తాము. ఇదే విషయాన్ని అందరికి తెలిపి అందరిచేత భగవద్గీతను పరమ పవిత్ర పరిశుద్ద అను బిరుదులతోనే గౌరవిస్తాము.

పరమ పవిత్ర పరిశుద్ద గ్రంథమైన భగవద్గీత కేవలము దేవుని జ్ఞానాన్ని మాత్రము తెలుపుచున్నది. గీత ఏ ఒక్క మతమునకు సంబంధించినది కాదు. ఇపుడు మనుషుల మధ్యలోనున్న అన్ని మతముల సారాంశము భగవద్గీతలో కలదు. గీత సమస్త మానవులకు దైవసందేశముగా ఉన్నది. గీతలో చెప్పిన జ్ఞానము ఇటు బైబిలులోను అటు ఖురాన్‌లోను కనిపిస్తున్నది. దేవుని చేత రెండుమార్లు చెప్పబడినది భగవద్గీత ఒక్కటి మాత్రమే. భగవద్గీతలో ఎంత వెదకినా జ్ఞానమే కనిపిస్తుంది. కానీ మతము ఏమాత్రము కనిపించదు. అందువలన గీతను మతాలకు అతీతమైనదని చెప్పవచ్చును. ముఖ్యముగా చెప్పుకుంటే సృష్ఠి ఆదిలో సూర్యుడు భగవద్గీతను విన్నపుడు భూమివిూద మతము పేరే లేకుండెడిది. తర్వాత కొంత కాలమునకు మాయ యొక్క ప్రభావముచేత మతము అనునది మానవుల మధ్యలోనికి వచ్చి చేరిపోయినది.