పుట:Mana-Jeevithalu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

కాని, మార్గమూ, లక్ష్యమూ వేరు కావు. అవి రెండూ సమ్మిళితమైన విశేషమది. మార్గమే లక్ష్యాన్ని నిర్ణయిస్తుంది. హింస ద్వారా శాంతి ఎన్నటికీ లభించదు. రక్షక భటులతో కూడిన ప్రభుత్వం శాంతియుతమైన ప్రజలని రూపొందించలేదు. నిర్బంధం ద్వారా స్వేచ్ఛను సాధించలేరు. ఒక రాజకీయ పక్షానికి అధికారమంతా ఉన్నప్పుడు వర్గరహితమైన సమాజం స్థాపించబడటం సాధ్యం కాదు. నిరంకుశాధికారంవల్ల అది ఏనాటికీ సిద్ధించదు. ఇదంతా సుస్పష్టం.

వ్యక్తి యొక్క ప్రత్యేకత సమూహంతో గాని, సిద్ధాంతంతో గాని ఐక్యత చేసుకోవటం వల్ల నాశనం కాదు. దాని స్థానంలో మరొకటి ఉంచినందువల్లగాని, దాన్ని అణచి వేసినందువల్ల గాని ప్రత్యేకత అనే సమస్యని తప్పించుకోలేరు. దాని స్థానంలో మరొకటి ఉంచినందువల్ల గాని, దాన్ని అణచినందువల్ల గాని తాత్కాలికంగా లాభించవచ్చు. కాని, వేరు అనే భావం మరింత ఉధృతంగా పైకి ఉబుకుతుంది. భయం వల్ల తాత్కాలికంగా వెనక్కి నొక్కి పెట్టవచ్చు. కాని సమస్య అలాగే ఉంటుంది. ప్రత్యేకతని పోగొట్టటం కాదు సమస్య - మనలో ప్రతి ఒక్కరం దానికంత ప్రాముఖ్యం ఎందుకిస్తున్నామన్నదే. వర్గరహిత సమాజాన్ని సృష్టించాలని కోరుతున్న వాళ్లే తమ అధికార బల ప్రయోగంతో విభేదాన్ని పెంపొందిస్తున్నవారు. మీరు వేరు, నేను వేరు; నేను వేరు, ఇంకొకరు వేరు. ఇది వాస్తవం. అయితే, ఈ వేరు అనే భావానికి మనం ఎందుకంత ప్రాముఖ్యం ఇస్తాం - దానికి దుష్ఫలితాలున్నాయని తెలిసి? మనందరిలోనూ చాలా వరకు పోలిక ఉన్నప్పటికీ, మనం ఒకరిని పోలి ఒకరం లేము. ఈ పోలిక లేకపోవటమనేదే మనం ఎవరికి వారు ప్రత్యక్షంగా ఉండటానికి ప్రాముఖ్యాన్ని కల్పిస్తుంది. పేరు, కుటుంబం, ఆస్తి - వీటితో వేరే వ్యక్తి నన్న భావం కలుగు తుంది. ఈ ప్రత్యేకత, ఈ వ్యక్తిత్వభావం ఎంతో హాని కలుగుజేస్తాయి. అందుకే సామూహిక కృషి నిర్వహణ, వ్యక్తిని మొత్తం సంఘంకోసం త్యాగం చెయ్యటం మొదలైనవి కోరటం జరుగుతుంది. మత వ్యవస్థలు వ్యక్తిగతమైన ఇచ్ఛను సమిష్టి ఇచ్ఛముందు మోకరిల్లేటట్లు ప్రయత్నించాయి. ఇప్పుడు రాజకీయ పక్షం ప్రభుత్వ బాధ్యతని చేపట్టి వ్యక్తిని ముంచి వెయ్యటానికి చేతనైనదంతా చేస్తోంది.