పుట:Mana-Jeevithalu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధికార శక్తి

91


భేద భావాన్ని పట్టుకుని ఎందుకంతగా ప్రాకులాడుతాం? మన అనుభూతులు వేరు. ఆ అనుభూతులతోనే బ్రతుకుతున్నాం. ఆ అనుభూతులే మనం. ఆ అనుభూతులను - సంతోషకరమైనవైనా బాధాకరమైనవైనా - లేకుండా చేస్తే ఇక మనం ఉండనే ఉండము. అనుభూతులు మనకి ముఖ్యం. వాటితోనే విభేదం. వ్యక్తిగత జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ విభిన్న అనుభూతులుంటాయి. విభిన్న స్థాయిల్లో అవి పరస్పరం పోరాడుకుంటూనే ఉంటాయి - వ్యక్తిగత జీవితంలో గాని, ప్రజా జీవితంలో గాని. అనుభూతిలో సంఘర్షణ సహజంగా ఉంటుంది. అధికారంతో గాని, నమ్రతతోగాని ఉండాలని కోరుతున్నంతకాలం, అనుభూతిలో సంఘర్షణ ఉండి తీరుతుంది. దానితో బాటే వ్యక్తిగతంగానూ, సాంఘికంగానూ దురవస్థ ప్రాప్తిస్తుంది.ఇంకా అవాలనో, ఇంత అవకూడదనో నిరంతరం కోరటం వలన వ్యక్తిత్వ భావం, భేదభావం ఉద్భవిస్తాయి. ఈ వాస్తవాన్ని మనం నిరసించకుండా, సమర్ధించకుండా, దానితో బాటే ఉండగలిగితే, మన జీవితమంతా అనుభూతులతో రూపొందినది కాదని తెలుసుకుంటాం. అప్పుడు మనస్సు, దాని స్మృతి, అనుభూతి ప్రశాంతంగా అయి, దాని సంఘర్షణలతో అది చీలిపోకుండా ఉంటుంది. అప్పుడే, మనస్సు నిశ్శబ్దంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడే, "నేను" "నా" అనేవి లేకుండా ప్రేమించటం సాధ్యమవుతుంది. ఇటువంటి ప్రేమ లేకుండా సామూహిక చర్య కేవలం బలత్కారం మాత్రమే అవుతుంది. అది వైరుధ్యాన్నీ, భయాన్నీ పెంపొందింపజేసి, వ్వ్యక్తిగత, సాంఘిక సంఘర్షణలకు దారి తీస్తుంది.


33. అధికార శక్తి

ఆయన చాలా బీదవాడు. కానీ, సమర్ధుడూ, తెలివైన వాడూ. ఆయన తనకున్న దానితో తృప్తి పడుతున్నట్లుగా ఉన్నాడు. అధమం, ఉన్నట్లు కనిపిస్తున్నాడు. ఆయనకు కుటుంబ భారం లేదు. ఆయన తరుచు ఇవీ అవీ మాట్లాడటానికి వస్తూ ఉంటాడు. ఆయనకి భవిష్యత్తు గురించి గొప్ప