పుట:Mana-Jeevithalu.pdf/98

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
89
ప్రత్యేకత

భావాలెక్కడ మొదలయాయో, ఇతరుల భావాలెక్కడ అంతమయాయో ఆయనకే తెలియటం కష్టం. తను తీవ్రమైన జాతీయవాదిననీ, దానికోసం ఒక విధంగా ఎంతో బాధ అనుభవించాననీ చెప్పాడాయన. మత ధర్మాన్ని ఆచరిస్తూండేవాడుట. ఇప్పుడా చెత్తంతా దులిపేసుకున్నాడుట. భగవంతుడి దయవల్ల మూఢవిశ్వాసాల నుంచి విముక్తి పొందాడుట. ఈ మానసికమైన విషయాల గురించి ప్రసంగాలూ, చర్చలూ జనాన్ని తప్పుత్రోవని పట్టిస్తాయని గట్టిగా నొక్కి చెప్పాడు. ముఖ్యంగా మనకి కావలసినది మానవుల ఆర్థిక పునర్వ్యవస్థ - మనిషి బ్రతకటానికి తిండి ముఖ్యం కనుక, తిండి తరువాతే తక్కినవన్నీ. రక్తవిప్లవం రావాలిట. వర్గరహితమైన సమాజం స్థాపింపబడాలిట. లక్ష్యం సాధించగలిగితే ఎటువంటి మార్గమయినా ఫరవాలేదుట. అవసరమైతే గందరగోళం పుట్టించి, అధికారాన్ని హస్తగతం చేసుకుని అప్పుడు సక్రమమైన వ్యవస్థని నెలకొల్పాలిట. సామూహికత అవసరమట. వ్యక్తిని దోపీడీ చెయ్యటాన్ని పూర్తిగా అణగద్రొక్కాలిట. భవిష్యత్తు గురించి సుస్పష్టంగా చెప్పాడాయన. మనిషి పరిస్థితుల ప్రభావంతో తయారైనవాడు. అవి భావిలో మరోలా రూపొందిస్తాయి. భావికోసం, రాబోయే ప్రపంచకోసం అన్నిటినీ త్యాగం చేస్తారు. ప్రస్తుతం ఉన్న మనిషిని రూపుమాపటం అంత ముఖ్యం కాదు వారికి, భవిష్యత్తు వారికి తెలుసును.

మనం చరిత్ర చదువుకుని చారిత్రాత్మక వాస్తవాలను మన దురభిప్రాయాల కనుగుణంగా అనువదించుకుంటాం. కాని, భవిష్యత్తు గురించి నిశ్చయంగా ఉండటం భ్రమకి లోనవటమే. మనిషి ఒక్క ప్రభావ ఫలితం కాడు. అతడు ఎంతో క్లిష్టమైనవాడు. ఒక ప్రభావానికి ప్రాముఖ్యం ఇచ్చి తక్కిన వాటిని అల్పం చేస్తే అస్థిరత పెంపొందుతుంది. అది మరింత కల్లోలానికీ, దుఃఖానికీ దారి తీస్తుంది. యావత్ప్రక్రియకీ రూపం మనిషి. ఒక్క భాగాన్ని మాత్రమే కాకుండా సమస్తమూ అర్థం చేసుకోవాలి - ఆ భాగం తాత్కాలికంగా ఎంత ముఖ్యమనిపించినప్పటికీ, భవిష్యత్తుకోసం ప్రస్తుతాన్ని త్యాగం చేసే పిచ్చి విపరీతమైన అధికార వాంఛ ఉన్నవాళ్లకే ఉంటుంది. అధికారం హానికరమైనది. ఇటువంటి వాళ్లు మానవులను ఒక దిక్కుకి మళ్లించే హక్కు తమకే ఉన్నదనుకుంటారు. వీళ్లు కొత్త రకం మత పోషకులు.