పుట:Mana-Jeevithalu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

చేసినప్పుడు స్వేచ్ఛ కలుగుతుంది. ఇచ్ఛ అంటే కోరిక. ఇచ్ఛాపూర్వకమైన చర్య ఏదైనా ఉంటే, స్వేచ్ఛగా ఉండటానికి గాని, శూన్యం చేసుకోవటానికి గాని, ఎట్టి ప్రయత్నం చేసినా స్వేచ్ఛ ఎప్పటికీ లభించదు. మొత్తం అస్తిత్వం పరిశుద్ధం కావటం జరగదు. చైతన్యావస్థలోని అనేకమైన పొరలు అన్నీ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు - సంపూర్ణంగా నిశ్చలంగా ఉన్నప్పుడు, అప్పుడే ఆ అపరిమితమైన, కాలంతో నిమిత్తంలేని ఆనందం లభిస్తుంది. పునఃసృష్టి సంభవమవుతుంది.

30. కోపం

అంత ఎత్తుమీద కూడా ఎండ తీక్షణంగా ఉంది. కిటికీ అద్దాలు ముట్టుకుంటే వెచ్చగా ఉన్నాయి. విమానం ఇంజను మోత హెచ్చూ తగ్గూ లేకుండా ఒకేలా వినిపిస్తూ జోకొడుతున్నట్లుగా ఉంది. చాలామంది ప్రయాణీకులు కునుకుతున్నారు. భూమి మాకు బాగా దిగువున ఎండలో మాడిపోతుంది. అంతా మట్టిరంగు, మధ్య మధ్య ఆకుపచ్చ రంగు అతుకులు. అప్పుడే భూమి మీదకు దిగాం. ఎండవేడి మరింత దుర్భరంగా ఉంది. నిజంగా బాధాకరంగా ఉంది. భవనం నీడలో నిలబడినా ఆ వేడికి బుర్ర పగిలి పోతుందేమోననిపించింది. అది వేసవికాలం. దేశమంతా ఎడారిలా ఉంది. మళ్లీ బయలుదేరాం. విమానం పైకి ఎగిరింది చల్లని గాలుల్ని వెతుక్కుంటూ కొత్తగా వచ్చిన ప్రయాణీకులు ఎదురుగా ఉన్న సీట్లలో కూర్చుని గట్టిగా మాట్లాడుకుంటున్నారు. వాళ్లమాటలు వినకుండా ఉండటం అసాధ్యంగా ఉంది. మొదలు పెట్టటం మెల్లిగానే మొదలు పెట్టారు. అంతలోనే వాళ్ల కంఠాల్లో కోపం ధ్వనిస్తూంది - చనువూ, విసుగూతో మిళితమైన కోపం. ఆ ఉద్వేగంలో తక్కిన ప్రయాణీకుల సంగతి మరిచిపోయినట్లున్నారు వాళ్లు. ఒకరిమీద ఒకరు ఎంత అసహనంతో ఉన్నారంటే, అక్కడ వాళ్లిద్దరే ఉన్నట్లూ, చుట్టు పక్కల ఇంకెవ్వరూ లేనట్లూనూ.

కోపానికి ఆవిధమైన ఒంటరితనాన్ని కల్పించే లక్షణం ఉంది. దుఃఖం లాగే అది కూడా వేరు చేస్తుంది. తాత్కాలికంగానైనా అన్ని సంబంధాలూ