పుట:Mana-Jeevithalu.pdf/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
54
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

రంగుదారాలు మగ్గాలికి బిగదీసి కట్టారు, బట్టనేయటానికి. వాళ్లు పని చేస్తూంటే గుంపుగా నిలబడి కొంతమంది పిల్లలు చూస్తున్నారు. ఆ దృశ్యం ముచ్చటగా ఉంది, రంగులతో, చప్పుళ్లతో, వాసనలతో, గ్రామస్థులు అప్పుడే స్నానాలు చేశారు. వాళ్ల ఒంటిమీద బట్టలు అతి స్వల్పంగా ఉన్నాయి, వాతావరణం వేడిగా ఉండటం మూలాన్ని సాయంకాలం అయేసరికి వాళ్లలో కొంతమంది తాగి అరుస్తూ మోటుగా ప్రవర్తిస్తున్నారు.

ఆ రమణీయమైన తోటనీ; ఈ సజీవమైన పల్లెనీ వేరు చేస్తున్న దొక్క పలుచని గోడ మాత్రమే. అందాన్ని పట్టుకుప్రాకులాడుతూ, అనాకారి తనాన్ని వద్దనటం సున్నితత్వం లేకపోవటం వల్లనే. విరుద్ధమైన దానిని అలవాటు చేసుకోవటం వల్ల మనస్సు సంకుచితమవుతుంది. హృదయం పరిమితమవుతుంది. సద్గుణం విరుద్ధమైనది కాదు. దానికి విరుద్ధంగా ఏదైనా ఉన్నదంటే అది సద్గుణం కాదింక. ఆ పల్లె అందాన్ని గ్రహించటానికి అక్కడి పచ్చని పూలతోటని చూసి ఆనందించగలగాలి. అయితే, అందాన్ని మాత్రమే గమనించి, అందంగా లేనిది కనిపించకుండా మూసుక్కూర్చుంటాం. ఈ విధంగా అణచిపెట్టటం వల్ల సున్నితత్వం లేకుండా పోవటం మొదలవుతుంది. అందాన్ని చూసి మెచ్చుకోవటం జరగదు. బాగున్నది ఊరికి దూరంగా ఉన్న తోటలో కాదు. ఆ రెండింటికి అతీతమైన సున్నితత్వంలో ఉంటుంది. వద్దనటం గాని, కావాలనటం గాని సంకుచితత్వానికి దారితీస్తుంది. అంటే సున్నితత్వం లేకుండా ఉండేటట్లు చేస్తుంది. సున్నితత్వం అనేది మనస్సు జాగ్రత్తగా పోషించుకోవలసినది కాదు. మనస్సుకి చేతనైనది విభజించటం, ఆధిక్యం కనపరచటం. మంచీ, చెడూ రెండూ ఉంటాయి. ఒకదాని వెంటబడి, రెండవదాన్ని తప్పించుకోవటం సున్నితత్వానికి దారి తీయదు. సత్యం ఉనికిని తెలుసుకోవటానికి సున్నితత్వం ముఖ్యంగా అవసరం.

సత్యం భ్రాంతికీ, అబద్ధానికీ విరుద్ధమైనది కాదు. విరుద్ధమైనది అనుకుంటూ దాన్ని చేరటానికి ప్రయత్నిస్తే అది ఎన్నటికీ దర్శనం కాదు. విరుద్ధమైనది నశిస్తేనే సత్యం ఉండటం సాధ్యం. నిరసించటం వల్లా, ఐక్యం చేసుకోవటం వల్లా విరుద్ధమైన వాటి మధ్య సంఘర్షణ పెరుగుతుంది.