పుట:Mana-Jeevithalu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సున్నితత్వం

55

సంఘర్షణ మరింత సంఘర్షణని పుట్టిస్తుంది. ఒక నిజాన్ని ఏవిధమైన భావోద్వేగం లేకుండా, కాదనకుండా చూసినట్లయితే సంఘర్షణ అనేది కలగదు. నిజం అనేదానికి విరుద్ధంగా మరింకేదీ ఉండదు. ఇష్టాయిష్టాలతో ఒక పక్షం వహించినప్పుడే విరుద్ధమైనది ఉంటుంది. ఈ పక్షపాత స్వభావమే సున్నితత్వం లేకుండా చేసి మన చర్యని ధ్వంసం చేస్తుంది.

మనం తోటలోనే ఉండిపోవాలనుకుంటే, గ్రామం అంటే విముఖత ఏర్పడుతుంది. ప్రతిఘటన ఉన్నప్పుడు చర్య తీసుకోవటం సాధ్యంకాదు. తోట పట్లగాని గ్రామం పట్లగాని. కార్య సంరంభం ఉండవచ్చు, కాని అది కార్యాచరణ కాదు. కార్య సంరంభానికి ఒక అభిప్రాయం ఆధారం, కార్యాచరణకు అలాకాదు. అభిప్రాయాలు పరస్పర విరుద్ధంగా ఉండొచ్చును. విరుద్ధమైన వాటి మధ్య కలిగే సంచలనం వట్టి కార్యసంరంభం మాత్రమే. ఎంతకాలం ఆగినా, ఎన్ని పరివర్తనలు చేసినా, కార్య సంరంభం వల్ల స్వేచ్ఛ ఎన్నటికీ లభించదు.

కార్య సంరంభానికి గతమూ భవిష్యత్తూ ఉంటాయి. కార్యాచరణకి అటువంటివి లేవు. కార్యాచరణ ఎప్పుడూ వర్తమానమే. అందుచేత తక్షణం జరుగుతుంది. సంస్కరణ అనేది కార్య సంరంభమే, కార్యాచరణ కాదు. సంస్కరణ అయిన దానికి ఇంకా సంస్కరణ అవసరమవుతుంది. సంస్కరణ అంటే అకర్మ. వ్యతిరేకత నుండి పుట్టినది కార్య సంరంభం. కార్యాచరణ క్షణక్షణమూ జరిగేది. సహజంగా కార్యాచరణలో వైరుధ్యం అనేది ఉండదు. కాని కార్య సంరంభం పైకి ఎడతెగకుండా జరుగుతున్నట్లు కనిపించినా దాని నిండా పరస్పర వైరుధ్యమే. విప్లవం అంతా పరస్పర విరుద్ధ శక్తులలో చిక్కుకున్నదే. అది ఎన్నటికీ స్వేచ్ఛను కలుగ జేయలేదు. సంఘర్షణా, ఎంపికా ఎన్నటికీ స్వేచ్ఛాదాయకం కాలేవు. ఎంపిక ఉంటే కార్యసంరంభం, ఉంటుంది, క్రియ ఉండదు. ఎంపిక అభిప్రాయం మీద ఆధారపడి ఉంటుంది. మనస్సు కార్యసంరంభంలో మునిగి తేలుతుంది తప్ప కార్యాచరణ జరగదు. కార్యాచరణ జరగటానికి మూలం వేరు.

చంద్రుడు పల్లె మీదుగా వచ్చాడు. తోటమీద నీడపడింది.