పుట:Mana-Jeevithalu.pdf/325

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

316

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.


"అవును. లేకపోతే నేనేమిటింక? అవును, అదే."

అందుచేత మీకున్న ఆస్తిపాస్తులే మీరు. మీపేరు, పరపతి, మీ కారు, ఇతర ఆస్తి, మీరు పెళ్లిచేసుకోబోయే అమ్మాయి, మీరు పైకి రావాలని ఉన్న ఆకాంక్షలు - ఇవే మీరు. ఇవీ, ఇంకా కొన్ని లక్షణాలూ, విలువలూ కలిస్తే "నేను" అని మీరు చెప్పుకునేదవుతుంది. అది పోతుందని భయం మీకు అన్నిటితో బాటూ అవీ పోయే అవకాశం ఎప్పుడూ ఉంటుంది. యుద్ధం రావచ్చు. విప్లవంగాని, ప్రభుత్వంలో వామపక్షం వైపుకి మార్పుగాని రావచ్చు. ఇవన్నీ మీకులేకుండా పోయేట్లు ఏదైనా జరగవచ్చు. ఇప్పుడు కాకపోతే రేపు. కాని, భద్రత లేదని భయపడటం దేనికి? భద్రత లేకపోవటమనేది ప్రకృతి సిద్ధం కాదా? రక్షణ లేకుండా ఉండకుండా మీరు గోడల్ని కట్టుకున్నారు మిమ్మల్ని రక్షించుకునేలా. ఈ గోడల్ని పడగొట్టనూ వచ్చు, పడిపోతాయి కూడా. కొంత కాలం వరకూ దాన్ని తప్పించుకోవచ్చు. కాని భద్రత లేకుండా పోయే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఉన్నస్థితిని తప్పించుకోలేరు. భద్రత లేకపోవటమనేది ఉంది - మీకిష్టం ఉన్నా లేకపోయినా, దాని అర్థం - అందు కోసం అన్నీ వదులుకోవాలని కాదు. దాన్ని అంగీకరించటమో, కాదనటమో కాదు. అయినా మీరు చిన్నవారు. భద్రత లేకపోవటం గురించి భయపడటం ఎందుకు?

"ఇప్పుడు మీరీవిధంగా చెబుతూంటే, భద్రత లేకపోవటం గురించి నాకు భయమనిపించటంలేదు. నిజానికి, పనిచెయ్యటానికి నాకభ్యంతరం లేదు. నా ఉద్యోగంలో నేను రోజుకి ఎనిమిది గంటలు పనిచేస్తాను. అది నాకు ప్రత్యేకం ఇష్టం లేకపోయినా, ఎలాగో గడుపుగోగలను. ఆస్తీ, కారూ మొదలైనవి పోతాయనే భయం లేదు నాకు. ఎప్పుడు కావాలనుకుంటే నేనూ నా స్నేహితురాలూ పెళ్లి చేసుకోగలం. నాకు భయంకలిగించేది ఏదీ కాదని గ్రహించానిప్పుడు. అయితే మరింకేమిటి?"

కనుక్కుందాం. నేను చెప్పగలనేమో. కాని అది మీరు కనుక్కున్నట్లవదు. అది కేవలం మాటలస్థాయిలోనే ఉంటుంది. అది ఉత్తి నిరుపయోగం. మీరు కనుక్కుంటే అది మీరు అనుభవం పొందినట్లవుతుంది. అదే ముఖ్యం. ఇద్దరం కలిసి కనుక్కుందాం.