పుట:Mana-Jeevithalu.pdf/324

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
315
భద్రత

సహజంగా ఇవన్నీ పోగొట్టుకోవాలని లేదు నాకు. అదే నా భయానికి కారణం కావచ్చు. కాని ఇంతే కాదు. అసలు ఉండనేమోనన్న భయం. భయంతో మెలుకువొచ్చినప్పుడు నేను దిక్కు తెలియనట్లూ, నేనేమీ కానట్లూ, ముక్కలై పోతున్నట్లూ ఉంటుంది."

అయినా, కొత్త ప్రభుత్వం రావచ్చు. మీ ఆస్తి పోగొట్టుకోవచ్చు, మీ కున్నవన్నీ పోగొట్టుకోవచ్చు. మీరింకా బాగా చిన్నవారు. మీరు ఎప్పుడైనా పనిచేసుకోవచ్చు. కోట్లమంది తమకున్న ప్రాపంచిక వస్తువుల్ని పోగొట్టుకుంటున్నారు. మీరు కూడా దాన్ని ఎదుర్కోవలసి రావచ్చు. ప్రపంచంలో ఉన్నవాటిని పంచుకోవాలిగాని ప్రత్యేకంగా సొంతం చేసుకోకూడదు. మీ వయస్సులోనే అంత దాచుకునేలా ఉండటం దేనికి? పోతుందని ఎందుకంత భయం?

"చూడండి, నేను ఒకానొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలను కుంటున్నాను. దానికేమి అడ్డురాకూడదని నా ఆందోళన. ఏదీ అడ్డురాక పోవచ్చు. కాని మేమిద్దరం ఒకర్ని విడిచి ఒకరు ఉండలేం. ఇది కూడా నా భయానికి కారణమై ఉండొచ్చు."

అదే మీ భయానికి కారణమా? మీరు ఆమెని వివాహం చేసుకొవటానికి ఏవిధమైన ఆటంకం కలగకపోవచ్చు నంటున్నారు. మరి భయం దేనికి?

"నిజమే, మేము ఎప్పుడనుకుంటే అప్పుడు వివాహం చేసుకోవచ్చు. నా భయానికి అది కారణం అవటానికి వీల్లేదు. అధమం ఇప్పట్లో, నా భయమంతా నేను ఇలా ఉండనేమోననీ, నా వ్యక్తిత్వాన్నీ, నాపేరునీ పోగొట్టు కుంటానేమోననీ నిజంగా భయపడుతున్నానేమో."

మీపేరు గురించీ, ఆస్తీ మొదలైన వాటి గురించీ లెక్కచెయ్యకపోయినా, అప్పటికి భయపడతారా? వ్యక్తిత్వానికి అర్థం ఏమిటి? పేరుతోనూ, ఆస్తితోనూ, ఒక వ్యక్తితోనూ, అభిప్రాయాలతోనూ మమేకమై ఉండటమే. ఏదో ఒక దానితో సంబంధం ఉండి ఉండటం, ఇదనీ, అదనీ గుర్తుపట్టేటట్లుగ ఉండటం, ఒక సంఘం, ఒక దేశం, అలాంటిదేదో ముద్రవేసి ఉండటం. ఆ ముద్ర పోతుందని భయపడుతున్నారు, అంతేనా?