పుట:Mana-Jeevithalu.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

284

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

"ఎందుకు వీలుకాదు? అనుభవమే మనిషిని వివేకవంతుణ్ణి చేస్తుంది. వివేకం ఉండటానికి జ్ఞానం ముఖ్యావసరం."

పోగుచేసుకున్న మనిషి వివేకవంతుడు కాగలడా?

"జీవితమంటేనే పోగుచేయటం. వ్యక్తి గుణం క్రమక్రమంగా రూపొందుతుంది. మెల్లిగా వికసిస్తుంది. అనుభవం అంటే జ్ఞానాన్ని కూడబెట్టుకోవటమే కదా. ఏది అర్థం చేసుకోవాలన్నా జ్ఞానం అత్యవసరం."

జ్ఞానంతోనూ, అనుభవంతోనూ అవగాహన కలుగుతుందా? జ్ఞానం అనుభవ శేషం, గతాన్ని సేకరించటం; జ్ఞానం, అనుభవం ఎప్పుడూ గతమే. గతం ఎప్పటికైనా అవగాహన చేసుకోగలదా? ఆలోచన నిశ్శబ్దంగా ఉన్న విరామసమయాల్లో కాదా అవగాహన కలిగేది? ఆ విరామ స్థలాన్ని పొడిగించటానికీ, కూడబెట్టటానికీ చేసిన కృషివల్ల అవగాహన కలుగుతుందా?

"సేకరణ లేకపోతే మనమే ఉండం. ఆలోచనకీ, ఆచరణకీ కొనసాగింపే ఉండదు. సేకరణే వ్యక్తి గుణం, సేకరణ సద్గుణం. పోగుచేయకుండా మనం బ్రతకలేం. ఆ కారు నిర్మాణం గురించి నాకు తెలిసి ఉండకపోతే నేను దాన్ని అర్థం చేసుకోలేను. సంగీత క్రమం తెలియకపోతే దాని విలువని నేను లోతుగా తెలుసుకోలేను. లోతులేని వాళ్లే సంగీతాన్ని విని సంతోషిస్తారు. సంగీతం విలువని తెలుసుకోవటానికి అది ఎలా రూపొందిందో, ఎలా సమకూడిందో తెలుసుకోవాలి. తెలుసుకోవటమే సేకరించటం. వాస్తవంగా తెలుసుకోకుండా వాటి విలువను తెలుసుకోలేము. ఏదో ఒక విధమైన సేకరణ అవసరం అవగాహనకి - అదే వివేకం."

కనుక్కోవటానికి స్వేచ్ఛ ఉండాలి, ఉండొద్దా? మీరు బంధింపబడి ఉంటే ఎంతో దూరం పోలేరు. ఏ రకమైన సేకరణ ఉన్నా స్వేచ్ఛ ఎలా ఉండగలుగుతుంది? డబ్బుని గాని, జ్ఞానాన్ని గాని కూడబెట్టిన మనిషి స్వేచ్ఛగా ఎన్నటికీ ఉండలేదు. వస్తువులు కూడబెట్టుకోకుండా మీరు స్వేచ్ఛగా ఉండి ఉండవచ్చు. కాని జ్ఞానంకోసం ఆశపడటం కూడా బంధమే, మిమ్మల్ని పట్టుకొని ఉంటుంది. ఏరకంగా కూడబెట్టినా దానికి కట్టివేయబడిన మనస్సు ఇటూ అటూ ఎంతో దూరం తిరిగి కనుక్కోగలదా? సద్గుణాన్ని సేకరించే