పుట:Mana-Jeevithalu.pdf/292

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
283
వివేకం పోగుచేసుకునే జ్ఞానంకాదు

ఎరుపు, నలుపు రంగుల చారలున్న ఉడత వచ్చి కిటికీలో కూర్చుని మమ్మల్ని చూసి అరుస్తూ ఉండేది. దానికి పప్పులు కావాలి. అక్కడికి చూడటానికి వచ్చిన ప్రతివారు తినిపించి ఉంటారు దానికి. ఇప్పుడు చూడటానికి వచ్చేవాళ్లు చాలా తక్కువ, వచ్చే శీతాకాలనికి దాచుకోవాలని అది ఆత్రుత పడుతోంది. అది చాలా చురుకుగా ఉత్సాహంగా ఉండే ఉడత. అది ఎప్పుడూ కూడబెట్టటానికి సిద్ధంగా ఉంటుంది, ముందు రాబోయే చల్లని మంచు నిండే నెలల కోసం. దాని నివాసం ఒక చెట్టు తొర్రలో ఉంది. అది ఎండిపోయి చాలా ఏళ్లయి ఉంటుంది.ఒక పప్పు ని చటుక్కున నోటకరచుకొని ఆ పెద్ద చెట్టు మొదలువైపుకి పరుగెత్తి చప్పుడు చేస్తూ పైకెక్కుతూ, అరుస్తూ, బెదిరిస్తూ ఆ కన్నంలోికి దూరిపోతుంది. మళ్లీ ఎంత వేగంగా దిగి వస్తుందంటే జారి క్రిందపడి పోతుందేమోననిపిస్తుంది. కాని ఎప్పుడూ పడలేదు. ఒక ఉదయం దానికి ఒక సంచీడు పప్పులు ఇస్తూ గడిపాం. అది ఎంతో స్నేహంగా అయి బాగా గది లోపలి దాకా వచ్చేది. దాని బొచ్చు మెరుస్తూ, దాని పెద్ద పూసల్లాంటి కళ్లు మిలమిల లాడుతుండేవి. దాని పంజాలు మొనదేరి ఉన్నాయి. దానితోక కుచ్చులా ఉంది. అది ఆనందంగా బాధ్యతాయుతంగా ఉన్న చిన్న జంతువు, అది ఆ చుట్టు పక్కల ఉన్నదాన్నంతా సొంతం చేసుకున్నట్లుగా ఉంది. ఎందుకంటే అది తక్కిన ఉడతల్ని అక్కడికి రాకుండా దూరంగా ఉండేట్లు చేసింది.

ఆయన సరదాగా ఉన్నాడు. వివేకంకోసం ఆత్రుత పడుతున్నాడు. దాన్ని ఆ ఉడత పప్పులు పోగుచేసుకున్నట్లుగా సేకరించాలనుకుంటున్నాడు. బాగా డబ్బున్నవాడు కాకపోయినా ఆయన చాలా చోట్లకే వెళ్లి ఉంటాడు. ఎందుకంటే, ఆయన ఎన్నో దేశాల్లో ఎంతోమందిని కలుసుకున్నట్లుగా కనిపిస్తున్నాడు. బాగా చదివినట్లు కూడా కనిపిస్తున్నాడు. గ్రీకు భాషలో బాగా చదవగలడన్నట్లు చెప్పాడు. సంస్కృతంలో కూడా స్వల్ప పరిజ్ఞానం ఉంది. ఆయనకి ముసలితనం వస్తోంది. అందుకని వివేకాన్ని సేకరించచాలని ఆత్రుత పడుతున్నాడు.

వివేకాన్ని సేకరించగలరా ఎవరైనా?