పుట:Mana-Jeevithalu.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
19
పూజలు, మతం మార్చుకోవటం

ప్రతిభా సామర్థ్యాల శక్తి కూడా ఆటంకం కలిగిస్తుంది. ఈ విధమైన ఆత్మవిశ్వాసం స్వార్ధచింతన వల్ల ఏర్పడేదే. కష్టమైనప్పటికీ, ఇటువంటి ఆత్మవిశ్వాసాన్నీ, శక్తినీ త్రోసి పుచ్చటం సాధ్యమే. ఇంతకన్న ఎంతో అస్పష్టమైనదీ, పైకి కనిపించనిదీ - ఏదో అవాలన్న తాపత్రయంలో ఉండే శక్తి, ఉత్సాహం. అహాన్ని పెంపొందించుకోవడం - ఏరూపంలోనైనా సరే - సంపదతో గాని, సద్గుణంతో గాని అది సంఘర్షణా ప్రక్రియే. దానివల్ల కలిగేది ద్వేషం, గందరగోళం. ఏదో అవాలనే తాపత్రయంతో నిండిన మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేదు. ప్రశాంతత సాధన వల్ల గాని, సమయానుకూలంగా గాని లభించేది కాదు. అవగాహనలోనే ప్రశాంతత ఉంటుంది. ఏదో అవాలనే కోరిక అవగాహన కానివ్వదు. ఏదో అవాలనుకోవటం సమయాభావాన్ని కలుగచేస్తుంది. అంటే, నిజానికి, తక్షణం అవగాహన చేసుకోకుండా ముందుకి నెట్టటమే. "ఫలానాగా అవుతాను" అనే భ్రాంతి అహానికి ప్రాధాన్యం ఇవ్వటం వల్లనే కలుగుతుంది.

పట్టణంలాగే సముద్రంకూడా అల్లకల్లోలంగా ఉంది. కాని దీని కల్లోలంలో నిగూఢత్వం ఉంది, నిండుతనం ఉంది. ఆకాశంలో నక్షత్రం కనిపిస్తోంది. మేము వెనక్కి మళ్ళి, బస్సులూ, కార్లూ మనుష్యులతో హడావిడిగా ఉన్న ఒక వీధిలోనుంచి నడుచుకుంటూ వెళ్ళాం. వీధి పక్కని ఒకచోట ఒకడు ఒంటిమీద బట్టలు లేకుండా పడుకున్నాడు. ముష్టివాడు. బాగా అలసిపోయి, బొత్తిగా తిండి లేకుండా ప్రాణావశిష్టంగా ఉన్నాడు. అతణ్ణి లేపటం కష్టం. ముందుకి పోతే పచ్చని గడ్డితో నిండిన ప్రదేశాలూ, పబ్లిక్ గార్డెన్లో రంగు రంగుల పువ్వులూ ఉన్నాయి.

8. పూజలూ, మతం మార్చుకోవటం

పెద్ద ఆవరణలో ఎన్నో చెట్ల మధ్యన ఉందా చర్చి. జనం - నల్లవాళ్ళూ తెల్లవాళ్ళూ దాని లోపలికి వెడుతున్నారు. యూరప్‌లో ఉన్న చర్చిలన్నిటిలో కన్నా ఎక్కువ వెలుగుంది దాని లోపల. కాని ఏర్పాట్లు మాత్రం అట్లాగే ఉన్నాయి. ప్రార్ధన జరుగుతోంది. అందులో అందం ఉంది. అది అయిపోయిన