పుట:Mana-Jeevithalu.pdf/272

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
263
జ్ఞానులా, వివేకవంతులా?

స్వేచ్ఛ లేకుండా, విశాలమైన మనస్సు లేకుండా అవగాహన సాధ్యం కాదు. అవగాహన జ్ఞానంవల్ల కలగదు. మాటల మధ్యా, ఆలోచనల మధ్యా ఏర్పడే విరామంలో అవగాహన కలుగుతుంది. ఈ విరామం జ్ఞానం భేదించలేని నిశ్శబ్దం. అది విశాలమైనది, అభేద్యమైనది, నిగూఢమైనది.

"జ్ఞానం ఉపయోగకరం, అత్యవసరం కాదా? జ్ఞానం లేకుండా కనిపెట్టటం ఎలా జరగగలదు?"

ఆవిష్కారం జరిగేది మనస్సు జ్ఞానంతో కిక్కిరిసినప్పుడు కాదు, జ్ఞానం లేనప్పుడే. అప్పుడే నిశ్చలత, విరామం ఉంటుంది. ఈ అవగాహన అయే స్థితిలోనే ఆవిష్కరణ జరుగుతుంది. జ్ఞానం ఒక స్థాయిలో ఉపయోగకరమే నిస్సందేహంగా. కాని మరొక దాంట్లో అది స్పష్టంగా హానికరమైనది. తన గొప్పతనాన్ని పెంపొందించుకోవటానికీ, తానుపైకి రావటానికీ, జ్ఞానాన్ని వినియోగించటం విభేదాన్నీ, విరోధాన్నీ పెంపొందింపజేసే దుష్టకార్యం. దేవుడు పేరుతో చేసినా, ప్రభుత్వం పేరుతో చేసినా, సిద్ధాంతం పేరుతో చేసినా ఆత్మవిస్తరణ వినాశమే. జ్ఞానం ప్రభావితం చేసేదైనప్పటికీ, ఒక స్థాయిలో అవసరమే: భాష, సాంకేతిక సామర్థ్యం మొదలైన వాటిల్లో. వీటివల్ల ప్రభావితం కావటం రక్షణ దాయకం, మన బాహ్య జీవనానికి అవసరమూను. కాని, ఇలా ప్రభావితం కావటాన్ని మానసికంగా ఉపయోగించుకున్నట్లయితేనూ, మానసిక సౌఖ్యానికీ, సంతృప్తికీ జ్ఞానం సాధనం అయినట్లయితేనూ, అప్పుడు జ్ఞానం సంఘర్షణనీ, గందరగోళాన్నీ పెంపొందించటం అనివార్యం. అది అలా ఉంచి, ఇంతకీ తెలుసుకోవటం అంటే అర్థం ఏమిటి? మీకు వాస్తవంగా తెలిసినది ఏమిటి?

"నాకు చాలా విషయాలు తెలుసు."

మీ ఉద్దేశం, మీకు చాలా విషయాల గురించి భోగట్టా తెలుసును. వివరాలు తెలుసును. కొన్ని యథార్థాల గురించి వివరాలు పోగుచేశారుః అయితే ఏమిటి? యుద్ధభీభత్సం గురించిన వివరాలు యుద్ధం రాకుండా చేస్తాయా? కోపం వల్లా, హింసవల్లా వ్యక్తిలోనూ, సంఘంలోనూ ఏర్పడే ఫలితాల గురించి మీ దగ్గర ఎన్నో వివరాలుండి ఉంటాయి నిశ్చయంగా. ఈ వివరాలు ద్వేషాన్నీ, వైరుధ్యాన్నీ అంతం చేయగలిగాయా?