పుట:Mana-Jeevithalu.pdf/273

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
264
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

"యుద్ధం వల్ల కలిగే ఫలితాల గురించిన జ్ఞానం యుద్ధాలను తక్షణం అంతం చెయ్యకపోవచ్చు. కాని, చిట్టచివరికి శాంతిని నెలకొల్పుతుంది. జనానికి తెలియజెప్పాలి. వారికి యుద్ధఫలితాలనూ, సంఘర్షణ ఫలితాలనూ చూపించాలి."

జనం అంటే మీరు, ఇంకొకరూను. మీ దగ్గర ఇన్ని వివరాలున్నాయి. అందువల్ల మీరు తక్కువ ఆకాంక్షాపరులూ, తక్కువ హింసాపరులూ, తక్కువ స్వార్థపరులూనా? మీరు ఎన్నో విప్లవాల గురించి చదివారు. అసమానత్వం యొక్క చరిత్ర చదివారు. కాని, మీరు అధికులమనే భావం లేకుండానూ, మీకు మీరు ప్రాముఖ్యాన్ని ఇచ్చుకోకుండానూ ఉన్నారా? ప్రపంచంలోని దుఃఖాల గురించీ, దుర్ఘటనల గురించీ అపారమైన జ్ఞానం మీకున్నందువల్ల మీరు ప్రేమ చూపిస్తున్నారా? మనకి జ్ఞానం ఉన్నదనుకునే విషయాల గురించి మనకేం తెలుసును?

"యుగయుగాల నుంచీ కూడబెట్టిన అనుభవమే జ్ఞానం. ఒక రకంగా అది సంప్రదాయం, రెండోది వ్యక్తంగానూ అవ్యక్తంగానూ ఉండే సహజ ప్రవృత్తి. దాగి ఉన్న జ్ఞాపకాలూ, అనుభవాలూ, సంక్రమించినవిగాని. సంపాదించినవి గాని మార్గదర్శకులై మన చర్యలను తీర్చిదిద్దుతాయి. ఈ జ్ఞాపకాలు - జాతీయమైనవీ. వ్యక్తిగతమైనవీ ముఖ్యావసరం - మానవుడికి సహాయపడుతూ రక్షణనిస్తాయి కనుక. అటువంటి జ్ఞానాన్ని వదిలేసుకోమంటారా?"

భయం వల్ల రూపొందిన చర్య, భయం మూలంగా తీసుకోబడిన చర్య చర్యేకాదు. జాతీయ దురభిప్రాయాలూ, భయాలూ, ఆశలూ, భ్రమలూ - వీటి ఫలితంగా తీసుకున్న చర్య ప్రభావితమైనది. ప్రభావితమైనదంతా మనం చెప్పినట్లు, మరింత సంఘర్షణనీ, దుఃఖాన్నీ పెంపొందిస్తుంది. తరతరాల నుంచీ వస్తున్న సంప్రదాయాల ప్రకారం బ్రాహ్మణుడిగా మీరు ప్రభావితం అయారు. ఏ ప్రేరేపణకైనా, సాంఘిక పరివర్తనలకైనా, సంఘర్షణలకైనా మీ ప్రతిక్రియ బ్రాహ్మణుడిగానే ఉంటుంది. మీ ప్రతిక్రియ మీరు ప్రభావితమైన దాన్ని బట్టీ, మీ గతానుభవాలను బట్టీ, జ్ఞానాన్ని బట్టీ ఉంటుంది. అందుచేత కొత్త అనుభవం మరింత ప్రభావితం చేస్తుంది. ఒక నమ్మకం ప్రకారం, ఒక