పుట:Mana-Jeevithalu.pdf/271

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

262

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.


పునఃసృష్టిలో అమాయకత్వం ఉంటుంది. తాను విశేషజ్ఞానం ఉన్న వాణ్ణని ఆయన అనుకుంటాడు. ఆయనకి జీవితసారమే జ్ఞానం. జ్ఞానం లేని జీవితం మరణం కన్న చెడ్డదిట. ఆయనకున్న జ్ఞానం ఒకటి రెండు విషయాల్లో కాదు, జీవితంలోని ఎన్నోదశలకు సంబంధించినది. అణువు గురించీ, ఆహారం గురించీ, కమ్యూనిజం గురించీ, ఖగోళశాస్త్రం గురించీ, నదిలో సంవత్సరానికి ప్రవహించే నీరు గురించీ, ఆహారం గురించీ, జనాభా పెరుగుదల గురించి ధీమాగా మాట్లాడగలిగాడు. తనకున్న జ్ఞానానికి గర్విస్తున్నాడాయన. ప్రదర్శనా చతురుడిలా తన ప్రభావాన్ని కనపరచాడు. ఇతరులు మౌనంగా, గౌరవప్రదంగా ఉండేట్లు చేశాడు. మనకి జ్ఞానం అంటే ఎంత భయం! తెలిసిన వాణ్ణి మనం ఎంత గౌరవిస్తాం! ఆయన ఇంగ్లీషు కొన్నిసార్లు అర్థం చేసుకోవటం కష్టమనిపించింది. తన దేశాన్ని విడిచి ఎప్పుడూ వెళ్లలేదుట. కాని ఇతరదేశాల పుస్తకాలున్నాయట ఆయన దగ్గర. కొందరు తాగుడుకో, ఇంకేదో ఆకలి తీర్చుకోవటానికో అలవాటు పడిపోయినట్లు ఆయన జ్ఞానార్జనకి అలవాటు పడ్డాడు.

"వివేకం అంటే ఏమిటి జ్ఞానం కాకపోతే? జ్ఞానాన్నంతటినీ అణచి వెయ్యాలని ఎందుకు చెబుతారు మీరు? జ్ఞానం అత్యవసరం కాదా? లేకపోతే మనం ఎక్కడ ఉండేవాళ్లం? ఇంకా ఆదిమవాసుల్లా, మన చుట్టూ ఉన్న అద్భుత ప్రపంచం గురించి ఏమీ తెలుసుకోకుండా ఉండిపోయేవాళ్లం. జ్ఞానం లేకపోతే ఏస్థాయిలో బ్రతకాలన్నా అసాధ్యం. అవగాహన కావటానికి జ్ఞానం అవరోధం అని ఎందుకు చెబుతున్నారు?"

జ్ఞానం ప్రభావితం చేస్తుంది. జ్ఞానం స్వేచ్ఛనివ్వదు. విమానంలో ఎగరటం, కొద్దిగంటల్లో ప్రపంచపు అవతలికొనకి వెళ్లటం తెలియవచ్చు, కాని అది స్వేచ్ఛ కాదు. జ్ఞానం సృజనాత్మకమైనది కాదు -జ్ఞానం కొనసాగుతూ ఉండేది కనుక. కొనసాగుతూ ఉండేది నిగూఢమైనదానికీ, అభేద్యమైనదానికీ, అపరిచితమైన దానికీ దారితీయలేదు. విశాలమైన దానికీ, అపరిచితమైన దానికీ, జ్ఞానం ప్రతిబంధకం. అపరిచితమైనదాన్ని పరిచితమైన దానితో కప్పి ఉంచటానికి కుదరదు. తెలిసినది ఎప్పుడూ గతంలోకి జరుగుతూ ఉంటుంది. గతం ప్రస్తుతాన్నీ, తెలియని దాన్నీ తన నీడలో ఉంచుతుంది.