పుట:Mana-Jeevithalu.pdf/26

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
17
ధనవంతులు, దరిద్రులు

చిలకలు పచ్చని మెరుపుల్లా వస్తున్నాయి గూటికి చేరుకోవటానికి. పొద్దున్నే ఉత్తరం వైపుకి తోటలూ, పొలాలూ బాహాటంగా ఉన్నచోటికి ఎగిరి వెళ్లాయి. సాయంకాలం తిరిగి వస్తున్నాయి పట్నానికి రాత్రిపూట చెట్లల్లో గడపటానికి. అవి ఎప్పుడూ మెల్లిగా ఎగరవు. ఎప్పుడూ, లక్ష్యం లేనట్లు చప్పుడు చేస్తూ కలకల్లాడుతూ ఉంటాయి. తక్కిన పక్షుల్లా అవి ఎప్పుడూ తిన్నగా ఎగరవు. ఎప్పుడూ ఎడమవైపుకో, కుడివైపుకో తిరుగుతూ హఠాత్తుగా ఏ చెట్టులోనో దూరుతాయి. ఎగురుతున్నంత సేపూ స్తిమితంగా ఉండవు. కాని, ఎర్రటి ముక్కులతో మిసమిసలాడే పచ్చదనంతో కాంతి వెదజల్లుతూ ఎంతో అందంగా ఉంటాయి. అసహ్యకరంగా ఉన్న పెద్ద పెద్ద డేగలు చుట్టూ తిరిగి తిరిగి తాటి చెట్లమీద కుదుట పడ్డాయి రాత్రికి.

ఎవడో పిల్లనగ్రోవిని వాయించుకుంటూ వస్తున్నాడు. నౌకరులా ఉన్నాడు. వాయించుకుంటూనే కొండమీదకి ఎక్కుతున్నాడు. మేము అతని వెనకాతలే నడుస్తున్నాం. అతను పక్కనున్న వీధుల్లో ఒక దాంట్లోకి మళ్ళాడు. ఇంకా వాయిస్తూనే ఉన్నాడు. గొడవ గొడవగా ఉండే పట్టణంలో ఆ పిల్లనగ్రోవి పాట వినటానికి వింతగా ఉంది. దాని శబ్దం గుండె లోతుల్లోనికి చొచ్చుకొని పోతోంది. ఎంతో బాగుంది. ఆ పిల్లనగ్రోవి పాటగాడి వెనకాలే కొంతదూరం వెళ్ళాం. ఎన్నో వీధులు దాటి చివరి కొక పెద్ద వీధిలోకి వచ్చాం. ఈ వీధిలో దీపాలతో వెలుగు బాగా ఉంది. కొద్ది దూరంలో ఎవరో కొంతమంది గుంపుగా రోడ్డుపక్కని కూర్చుని తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటున్నారు. పిల్లనగ్రోవి వాయించేవాడు వాళ్ళదగ్గరికి చేరాడు. మేమూ అదే పని చేశాం. అతను వాయిస్తుంటే మేమూ చుట్టూ కూర్చొని వింటున్నాం. వాళ్ళంతా డ్రైవర్లూ, ఇళ్ళలో పనిచేసే నౌకర్లూ, రాత్రిపూట కాపలా కాసేవాళ్ళూ, కొంతమంది చిన్నపిల్లలూ, ఒకటో రెండో కుక్కలూ. పక్కనుంచి కార్లు పోతున్నాయి. ఒకదాంట్లో అందమైన దుస్తులు వేసుకున్న ఒకావిడ ఒంటరిగా కూర్చునుంది. కారులో దీపాలు వెలుగుతున్నాయి. డ్రైవరు కారు నడుపుతున్నాడు. ఇంకోకారు వచ్చి అక్కడ ఆగిపోయింది. డ్రైవరు దిగివచ్చి మాతోబాటు కూర్చున్నాడు. వాళ్ళంతా కబుర్లు చెప్పుకుంటున్నారు సరదాగా నవ్వుతూ, చేతులూపుతూ, పిల్లనగ్రోవి మీద పాట మాత్రం తొట్రుపడలేదు. ఎంతో