పుట:Mana-Jeevithalu.pdf/25

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
16
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

అవాలనే కాంక్ష ఎంత బలమైనది! విజయం, నమ్రత ఒకచోట ఎలా ఉంటాయి? కాని, ఆధ్యాత్మికంగా స్వలాభం కోసం ఇతరులను ఉపయోగించుకునేవారూ, వినియోగింపబడేవారు కూడా చేస్తున్నదదే. అందులోనే సంఘర్షణ, దుఃఖమూ ఉంటాయి.

"అంటే, గురువు అనేవాడు లేడనీ, నేను శిష్యుణ్ణి అనుకోవటం కేవలం భ్రాంతి అనీ, కల్పన అనీ మీ ఉద్దేశమా?" అని అడిగాడాయన.

గురువు ఉన్నాడా లేడా అన్నది అల్ప విషయం. స్వలాభం కోసం ఇతరులను ఉపయోగించుకొనే వారికీ, రహస్య సంఘాలకీ, శాఖలకీ మాత్రం అది చాలా ముఖ్యమై విషయం. కాని, పరమానందదాయకమైన సత్యాన్నీ అన్వేషించే మనిషికి ఆ ప్రశ్న పూర్తిగా అసందర్భమైనదవుతుంది. గురువూ, శిష్యుడూ ఎంత ముఖ్యమైనవారో ధనవంతుడూ, కూలివాడూ కూడా అంతే ముఖ్యమైనవారు. గురువులున్నారో లేదో, ప్రవేశదశలో ఉన్నవారినీ, శిష్యులనీ తేడాలున్నాయో లేదో ముఖ్యం కాదు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవటమే ముఖ్యం. స్వీయ జ్ఞానం లేకుండా, సహేతుకంగా ఆలోచించడానికి ఆస్కారం లేదు. ముందు మిమ్మల్ని మీరు తెలుసుకోకుండా సత్యం ఏమిటో ఎలా తెలుసుకోగలరు? స్వీయజ్ఞానం లేకపోతే భ్రాంతి మాత్రమే మిగులుతుంది. మీరు ఇది, మీరు అది అని ఎవరో చెబితే నమ్మటం పసితనం అనిపించుకుంటుంది. ఈలోకంలో గాని, ఇంకోచోట గాని ప్రతిఫలం చూపుతానన్న వాడిని కాస్త జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి.


7. ధనవంతులు, దరిద్రులు

వేడిగానూ, ఉక్కగానూ ఉంది. పట్నవాసపు చప్పుళ్ళతో గాలి నిండి ఉంది. సముద్రం మీంచి వచ్చే గాలి వెచ్చగా ఉంది. తారువాసన, పెట్రోలు వాసనా వేస్తోంది. దూరాన నీటిలో అస్తమిస్తున్న సూర్యుడు ఎర్రగా ఉన్నాడు. ఇంకా వేడి తగ్గేట్లుగా లేదు. గది నిండా మూగిన జనం అప్పుడే వెళ్ళారు. మేము వీధిలోకి వచ్చాం.