పుట:Mana-Jeevithalu.pdf/24

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
15
శిష్యుడు, గురువు.

దురదృష్టవశాత్తూ, ఇతరుల నుంచి స్వలాభాన్ని ఆశించేవారూ, వారి స్వలాభానికి గురి అయేవారూ కూడా తమ పరస్పర అనుబంధానికి మురిసిపోతూ ఉంటారు. ఈవిధంగా విస్తృతమయ్యే ఆత్మ తృప్తినే ఆధ్యాత్మిక పురోగతి అంటూ ఉంటారు. ముఖ్యంగా, శిష్యుడికీ గురువుకీ మధ్య కొందరు మధ్యవర్తులున్నప్పుడు, అందులోనూ గురువు మరో దూరదేశంలో ఉండి సులభంగా అందుబాటులో లేనప్పుడు పరిస్థితి మరింత అసహ్యకరంగానూ, దుర్భరంగానూ ఉంటుంది. ఈ అందుబాటులో లేకపోవటం, సూటిగా చేరలేకపోవటం ఆత్మ వంచనకూ అమాయకపు భ్రాంతికీ దారితీస్తుంది. ఇటువంటి భ్రాంతిని గడుసువాళ్ళూ, కీర్తికాంక్షా, అధికార కాంక్షా ఉన్నవాళ్ళూ తమ స్వలాభానికి అపయోగించుకుంటారు.

నమ్రత లేనప్పుడే ప్రతిఫలం, శిక్షా ఉంటాయి. ఆధ్యాత్మిక సాధనం వల్లనూ, ప్రాపంచిక విషయాలను త్యజించటం వల్లనూ సాధించే అంతిమ లక్ష్యం కాదు నమ్రత. నమ్రత సాధన చేసి పొందే గుణం కాదు; అభ్యాసంవల్ల సాధించేదీ కాదు. అలవరచుకున్న గుణం సద్గుణం ఏనాటికీ కాదు; అది కేవలం ఒక సాధించిన విజయం అవుతుంది, మీ గొప్పల పట్టికలో మరొక అంశం అవుతుంది. అంతే. సద్గుణాన్ని అలవరచుకోవడం అంటే అహాన్ని త్యజించడం కాదు. అహం ఉన్నదని స్పష్టంగా గ్రహించటం.

నమ్రతకి పైవాడు, క్రిందివాడు, గురువు, శిష్యుడు అనే భేదం తెలియదు. గురువుకీ శిష్యుడికీ మధ్యా, సత్యానికీ మీకూ మధ్యా విభజన ఉంటే అవగాహన అవటం సాధ్యంకాదు. సత్యాన్ని అర్ధం చేసుకోవటంలో గురువూ లేడూ, శిష్యుడూ లేడు, పురోగమించినవాడూ లేడు. అధోగతిలో ఉన్నవాడూ లేడు. గతించిన క్షణం యొక్క భారం గాని చిహ్నంగాని లేకుండా ఉన్నదానిని, అంటే వర్తమానాన్ని అనుక్షణమూ అర్థం చేసుకోవటమే సత్యం.

ప్రతిఫలం, శిక్ష అనేవి అహాన్ని శక్తియుతం చేసి నమ్రతను తోసి వేస్తాయి. నమ్రత ప్రస్తుతంలో ఉండాలి. భవిష్యత్తులో కాదు. మీరు నమ్రతగా అవబోవటం అనేది సాధ్యంకాదు. అవబోతున్నారంటేనే అహానికి ప్రాధాన్యాన్ని ఇవ్వటం కొనసాగిస్తున్నారని అర్ధం. అంటే సద్గుణాన్ని కలిగి ఉండటాన్ని ప్రస్తుతానికి విరమించుకున్నట్లేకదా. ఎప్పుడో జయం సాధించాలనీ, ఏదో