పుట:Mana-Jeevithalu.pdf/23

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
14
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

చుడుతున్నారు. రాత్రిళ్ళు విహరించే ఒక పక్షి నిశ్శబ్దంగా అటు ఎగిరి వెళ్ళింది. ఆ విశాలమైన నదికి అవతల ఒడ్డున ఎవరో పాడటం మొదలుపెట్టారు. అతడి పాటలోని పలుకులు స్పష్టంగా దూసుకు వస్తున్నాయి. మళ్ళీ, జీవితంలోని సర్వవ్యాప్తమైన ఏకాంతం.

6. శిష్యుడు, గురువు

"నేను ఫలానా గురువుకి శిష్యుణ్ణని నాతో చెప్పారు" అంటూ ప్రారంభించారాయన . "మీరేమంటారు? దీన్ని గురించి మీ అభిప్రాయం ఏమిటో నిజంగా తెలుసుకోవాలని ఉంది నాకు. నేను ఆ సమాజానికి చెందిన వాణ్ణని మీకు తెలుసును. ప్రవేశ దశలో ఉన్నవారిలో ఉత్తముడిగా అయే అవకాశం నాకు ఈ జన్మలో ఉందని అంతఃప్రభువులకు ప్రతినిధులైన బాహ్య అధికారులు చెప్పారు నాతో." ఆయన దాన్ని చాలా మనఃపూర్వకంగా నమ్మాడు. మేము చాలాసేపు మాట్లాడుకున్నాం.

ప్రతిఫలం అనేది ఏ రూపంలో లభించినా అత్యంత సంతోష దాయకమే. ముఖ్యంగా ప్రాపంచిక పదవులను లక్ష్యం చేయని వారికీ, మామూలు ప్రపంచంలో జయం సాధించలేని వారికీ, మహోన్నత స్థితికి పురోగమించిన ఒక ఆధ్యాత్మిక జీవి ప్రత్యేకంగా స్థాపించిన సమాజానికి చెంది ఉండటం అనేది చాలా తృప్తి కలిగించే విషయం. సహజంగా, వారు చెప్పినదంతా చేసినందరకూ, అవసరమైన త్యాగాలన్నీ చేసినందుకూ తగిన ప్రతిఫలం ముట్టవలసిందే. ప్రతిఫలం అంటే మామూలుగా ఏదో ఇచ్చినట్లు కాక, వారి ఆధ్యాత్మిక పురోగతిని ప్రశంసించటమో, లేక బాగా సమర్థవంతంగా నడపబడుతున్న సంస్థలో బాగా పని చేస్తే మరింత బాగా పని చేయటానికి వారి పనిని మెచ్చుకోవటమో లాంటిది.

అభివృద్ధిని ఆరాధించే ప్రపంచంలో ఈ రకమైన ఆత్మపురోభివృద్ధిని ఎవరైనా అర్ధం చేసుకుంటారు. ప్రోత్సహిస్తారు. కాని, మీరు ఒక గురువుకి శిష్యుడు అని ఎవరో చెబితే వినటమో, లేక స్వయంగా అనుకోవటమో ఎన్నో రకాలైన అసహ్యకరమైన స్వలాభపూరిత ప్రయత్నాలకు దారితీస్తుంది.