పుట:Mana-Jeevithalu.pdf/244

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చర్యలో స్పష్టత.

235

మీరు అనుభవించినప్పుడు, ఎవరో చెప్పారని కాకుండా మీ అంతట మీరే సూటిగా గ్రహించినట్లయితే ఉన్న స్థితి స్పష్టంగా తెలుస్తుంది. స్పష్టతని నిలబెట్టుకోనక్కరలేదు. అది ఉంటుందంతే.

"మీరు చెప్పింది గ్రహించాను. అవును, నాకు స్పష్టంగా ఉంది. అది బాగానే ఉంది. కాని ప్రేమ మాటేమిటి? మేము ప్రేమంటే ఎరగం. నేను ప్రేమించాననుకున్నాను. కాని లేదని తెలుసును."

మీరు నాకు చెప్పినదాన్ని బట్టి మీరు ఒంటరితనం అంటే భయంతోనూ, శారీరక వాంఛలు, అవసరాల కోసమూ వివాహం చేసుకున్నారు. అదంతా ప్రేమ కాదని తెలుసుకున్నారు. మర్యాదకోసం దాన్ని ప్రేమ అని ఉండవచ్చు. కాని, నిజానికి అది "ప్రేమ" అనే మాట - అవసరానికి తొడిగిన ముసుగు. చాలామందికి అదే ప్రేమ - గందరగోళం అనే పొగతో నిండినది. రక్షణ లేకపోవటంవల్ల, ఒంటరితనంవల్ల, నిస్పృహవల్ల, వృద్ధాప్యంలో జరిగే ఉపేక్ష, మొదలైన వాటివల్ల భయమే ఆ గందరగోళం. కాని ఇదంతా ఆలోచనా ప్రక్రియే - ప్రేమకాదు నిశ్చయంగా. ఆలోచన పదేపదే మళ్లీ చేయిస్తుంది. పదేపదే మళ్లీ చేసేది బాంధవ్యాన్ని పాతబడి పోయేటట్లు చేస్తుంది. ఆలోచన నిరర్థక ప్రక్రియ. అది వినూత్నం చేసుకోదు. కొనసాగుతూ ఉండగలదంతే. కొనసాగుతున్నది కొత్తదీ, స్వచ్ఛమైనదీ కాలేదు. ఆలోచన అనుభూతి. ఆలోచన వాంఛ. ఆలోచన సృజనాత్మకం కావటానికి తన్ను తాను అంతం చేసుకోలేదు. ఆలోచన, అనుభూతి మినహా మరొకటి అవలేదు. ఆలోచన ఎప్పుడూ వాడిపోయినదే, గతించినదే, పాతదే. ఆలోచన ఎప్పటికీ కొత్తది కాలేదు. మీరు గ్రహించినట్లు, ప్రేమ ఆలోచన కాదు. ఆలోచించేది లేనప్పుడు ప్రేమ ఉంటుంది. ఆలోచించేది వేరూ, ఆలోచన వేరూ కాదు. ఆలోచనా, ఆలోచించేదీ ఒకటే. ఆలోచించేదే ఆలోచన.

ప్రేమ అనుభూతి కాదు. అది పొగలేని జ్వాల. మీరు ఆలోచించే దానిగా ఉండనప్పుడు ప్రేమని తెలుసుకుంటారు. ప్రేమకోసం మిమ్మల్ని మీరు, ఆలోచించే దాన్ని త్యాగం చెయ్యలేరు. ప్రేమకోసం కావాలని చర్యతీసుకోలేరు - ప్రేమ మనస్సుకి చెందినది కాదు కనుక. క్రమశిక్షణ, ప్రేమించాలనే ఇచ్ఛా ప్రేమించాలనే ఆలోచన మాత్రమే. ప్రేమ గురించిన