పుట:Mana-Jeevithalu.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చర్యలో స్పష్టత

233

ఆవిడ బాగా చిన్నది, ఇరవైపైన ఉంటుంది. కొత్తగా వివాహం అయిందిట. కాని వయస్సు మీరుతున్నట్లు ఉంది చూడటానికి. తను మంచి కుటుంబంలోంచి వచ్చానని చెప్పింది - సంస్కారం ఉన్న కుటుంబం, కష్టపడి పనిచేసే కుటుంబం తమది. ఎం. ఎ. చేసిందిట ఆనర్స్‌తో. తెలివైనదీ, చురుకైనదీ అని తెలుస్తూనే ఉంది. ఒకసారి మొదలుపెట్టాక, సునాయాసంగా, ధారాళంగా మాట్లాడింది. కాని, ఉన్నట్లుండి, సిగ్గుపడి మౌనంగా ఉండిపోతుంది. తన భారం తీర్చుకోవాలని ఉందిట. ఎవ్వరితోనూ తన సమస్య గురించి చెప్పలేదుట - తన తల్లితండ్రులకు కూడా చెప్పలేదుట. క్రమక్రమంగా కొద్దికొద్దిగా తన బాధని మాటల్లో పెట్టింది. మాటలు భావాన్ని కొంతవరకే తెలియజేస్తాయి. ఒక విధమైన అపార్థాన్ని కలిగించి, చెప్పదలుచుకున్న దాన్ని పూర్తిగా చెప్పవు. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా, మోసం చేస్తాయి. ఆవిడ ఎంతో చెప్పదలుచుకుంది - ఆవిడ మాటలు చెప్పిన దానికన్న. ఆవిడే గెలిచింది. కొన్ని విషయాల గురించి చెప్పలేక పోయింది, ఎంత కష్టపడి ప్రయత్నించినా. కాని, ఆవిడ మౌనమే ఆవిడ బాధల్నీ, కేవలం ఒక బంధనంగా మిగిలిపోయిన ఆ బాంధవ్యంలో ఆవిడ పొందిన అవమానాల్నీ తెలియజేసింది. భర్త ఆవిణ్ణి కొట్టి వదిలేశాడుట. ఉన్న పిల్లలు మరీ చిన్నవాళ్లు - తనకు తోడుగా ఉండాలంటే. తను ఏం చెయ్యాలి? ఇప్పుడు వాళ్లు వేరుగా ఉంటున్నారు. వెనక్కి తిరిగి వెళ్లాలా?

మర్యాద ఎంత బలంగా నొక్కి పెడుతుంది మనల్ని! అంతా ఏమనుకుంటారు? ఒంటరిగా ఉండటం సాధ్యమేనా. ముఖ్యంగా ఆడది - అందరూ అడ్డమైన మాటలు, అనకుండా? మర్యాద అనేది వంచకులు కప్పుకునే ముసుగు. ఆలోచనలో వీలైన నేరాలన్నీ చేస్తాం. కాని, పైకి వేలెత్తి చూపించటానికేమీ ఉండదు. ఆవిడ మర్యాదగా ఉండాలనుకుంటోంది. గందరగోళంలో పడింది. చిత్రమేమిటంటే, తన లోలోపల స్పష్టంగా ఉన్నప్పుడు ఏం జరిగినా సరియైనదే అనిపిస్తుంది - అంతరంగికంగా ఈ స్పష్టత ఉన్నప్పుడు. తాను కోరినట్లుగా చేసినది కాదు సరియైనది అంటే. ఎలా ఉన్నప్పటికీ ఉన్న స్థితే సరియైనది. ఉన్న స్థితిని అర్థం చేసుకోవటంతో తృప్తి కలుగుతుంది. కాని స్పష్టంగా ఉండటం ఎంత కష్టం!