పుట:Mana-Jeevithalu.pdf/241

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
232
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

మందకొడిగా, గౌరవనీయంగా, సద్గుణం లేకుండా ఉన్నవాళ్లు స్వేచ్ఛగా ఉండగలరా? ఏకాంతంలో ఉండే స్వేచ్ఛ అంటే తన చుట్టూ మూసుకుని ప్రత్యేకంగా వేరుగా ఉండటంకాదు. ధనంతో గాని, దారిద్ర్యంతో గాని, జ్ఞానంతోగాని విజయంతోగాని, భావంతోగాని, సద్గుణంతో గాని ప్రత్యేకంగా వేరుగా ఉండటం అంటే మందకొడిగా, సున్నితత్వం లేకుండా ఉండటమే. మందకొడిగా, గౌరవనీయంగా ఉండేవారు సంపర్కం కలిగించుకోలేరు. ఒకవేళ కలిగించుకుంటే, అది వారి స్వయంకల్పనలతోనే. సంపర్కం కలగటానికి సున్నితత్వం, సుకుమారత్వం, ఏదో అవాలనుకోవటంనుంచి - అంటే, భయంనుంచి స్వేచ్ఛా ఉండాలి. ప్రేమ అంటే ఏదో అవటం, "నేను అవాలి" అనుకోవటం కాదు. అవుతూ ఉండేది సంపర్కం కలిగించుకోలేదు - అది ఎప్పుడూ తన్న తాను ప్రత్యేకపరుచుకుంటుంది కనుక.

ప్రేమ సుకుమారమైనది. ప్రేమ విశాలమైనది. అభేద్యమైనది, అపరిచితమైనది.

71. చర్యలో స్పష్టత

అ ఉదయం రమణీయంగా ఉంది. వర్షాలు కురిశాక స్వచ్ఛంగా ఉంది. చెట్లు లేత చిగుళ్లు తొడిగాయి. సముద్రపు గాలికి అవి నాట్యం చేస్తున్నాయి. గడ్డి పచ్చగా ఒత్తుగా ఉంది. పశువులు దాన్ని ఆవురావురుమని తింటున్నాయి. కొద్ది నెలలుపోతే నాలుగుపరకల గడ్డి కూడా మిగలదు. తోటలోని పరిమళంతో గది నిండింది. పిల్లలు అరుస్తూ నవ్వుతున్నారు. కొబ్బరి చెట్లని పచ్చని కొబ్బరి కాయలున్నాయి.

పెద్ద పెద్ద అరిటాకులు ఊగుతున్నాయి. ఇంకా గాలికి చిరిగిపోలేదు. భూమి ఎంత అందంగా ఉంది, వర్ణకవితలా ఉంది! ఊరవతల పెద్ద ఇళ్లు, తోటలు. అవి దాటిన తరవాత సముద్రం ఉంది, నిండువెలుగుతో, ఉట్టిపడే కెరటాలతో: దూరాన చిన్న పడవ ఉంది - బల్ల చెక్కలు పేర్చినది. ఒంటరిగా ఒకడు చేపలు పడుతున్నాడు.