పుట:Mana-Jeevithalu.pdf/21

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
12
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

ఆలోచనని అర్థం చేసుకోవాలి. అంతేకాని, ఆలోచనలో ప్రేమని బంధించటానికి ప్రయత్నించటం కాదు. ఆలోచనని కాదన్నంత మాత్రాన ప్రేమ సాధ్యం కాదు. ఆలోచన యొక్క ప్రాముఖ్యాన్ని పూర్తిగా అర్ధం చేసుకున్నప్పుడే ఆలోచననుంచి స్వేచ్ఛ లభిస్తుంది. అందుకు అపారమైన ఆత్మజ్ఞానం అవసరం, అంతేగాని, పైపై డాబులూ, దర్పాలూ కాదు. ధ్యానం చేయటం అంటే పునశ్చరణ కాదు, తెలుసుకోవటం అంటే నిర్వచనం కాదు - ఇవే ఆలోచనా రీతుల్ని విశదం చేస్తాయి. ఆలోచనా రీతుల్ని తెలుసుకోకుండా, పరిశోధించ కుండా ప్రేమ సాధ్యం కాదు.

5. ఏకాంతం, ఒంటరితనం

సూర్యుడు అస్తమించాడు. చీకట్లు పులుముకుంటున్న ఆకాశం క్రింద చెట్ల ఆకారాలు నల్లగా కనిపిస్తున్నాయి. విశాలంగా ఉధృతంగా ఉండే నది ప్రశాంతంగా, నిశ్చలంగా ఉంది. చంద్రబింబం దూరంగా ఆకాశంలో లీలగా కనిపిస్తోంది. రెండు మహా వృక్షాల మధ్యనుంచి పైకి వస్తోంది. ఇంకా చెట్ల నీడలు పడటం లేదు.

ఎత్తుగా ఉన్న నదిఒడ్డు మీదుగా నడిచి పచ్చని వరిచేల చుట్టూ ఉన్న మార్గం గుండా వెళుతున్నాం. ఈ మార్గం చాలా పురాతనమైనది. దాని మీద ఎన్నో వేలమంది నడిచారు. తరతరాలుగా నిశ్శబ్దంగా అలాగే ఉందది. చేలమధ్య నుంచీ, మామిడి తోపుల్లోంచీ, చింత తోపుల్లోంచీ, పాడుపడిన దేవలయాల పక్కనుంచీ పోతుందది. మధ్య మధ్య తోటలు; పచ్చ సంపెంగ పువ్వులు సన్నని పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. పక్షులు రాత్రి తలదాచుకునేందుకు గూళ్ళకి చేరుకుంటున్నాయి. పెద్ద చెరువులో నక్షత్రాల నీడలు కనిపించటం మొదలుపెట్టాయి. ప్రకృతి భాషించే స్థితిలో లేదు ఆ సాయంకాలం. చెట్లు నిశ్శబ్దంగా చీకట్లోకి తప్పుకొని ఒంటరిగా ఉన్నాయి. ఎవరో కొద్ది మంది గ్రామస్తులు కబుర్లు చెప్పుకుంటూ సైకిళ్లు తొక్కుకుంటూ వెళ్ళిపోయారు. మళ్లీ ఏకాంతంగా ఉన్నప్పుడు ఉండే గంభీర నిశ్శబ్దం, ప్రశాంతతా ఏర్పడ్డాయి.