పుట:Mana-Jeevithalu.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
11
ఆలోచన, ప్రేమ

పోవటమనీ, నిర్లక్ష్యమనీ అనుకొని, ఆ వ్యక్తిని గురించి ఆలోచించటం మొదలుపెడతారు. ఫోటోగ్రాపులూ లిఖితచిత్రాలూ పెట్టుకుంటారు. మానసికంగా చిత్రించుకుంటారు. ఆ విధంగా మానసికమైనవాటితో హృదయాన్ని నింపేసుకుంటే ఇక, ప్రేమకి చోటు లేకుండా చెయ్యటమే అవుతుంది. మీరొక స్నేహితుడితో ఉండగా అతడి గురించి ఆలోచించరు. మనిషి దగ్గర లేనప్పుడే గడిచిపోయిన దృశ్యాలనూ, జరిగిపోయిన అనుభవాలనూ, గతించిన వాటిని నెమరు వేసుకుంటారు. ఈవిధంగా గతాన్ని స్మరించటమే ప్రేమ, సజీవంగా ఉన్నది కాదు అనుకుంటాం. గతంతోనే బ్రతుకుతాం - గతించి పోయిన వాటితోనే. అందుచేత మనంకూడా గతించి పోయినట్లే, దాన్నే ప్రేమ అన్నప్పటికీ.

ఆలోచనా ప్రక్రియ ప్రేమను త్రోసిపుచ్చుతుంది. ఆలోచనలోనే ఆవేశం తెచ్చే చిక్కులుంటాయి, ప్రేమలో కాదు. ఆలోచన ప్రేమకి పెద్ద అవరోధం. ఉన్నదానికీ, ఉండాలనుకునేదానికి మధ్య భేదం ఆలోచన సృష్టించినదే.

ఈ విభేదం మీదనే నీతి ఆధారపడి ఉంది. నీతిగా ఉన్న వాళ్ళకీ అవినీతిగా ఉన్నవాళ్ళకీ కూడా ప్రేమంటే ఏమిటో తెలియదు. సాంఘిక సంబంధాలను కట్టుదిట్టం చెయ్యటానికే నీతి అనేదాన్ని సృష్టించింది మనస్సు - అది ప్రేమ కాదు. కేవలం సిమెంటులా గట్టి పరిచేది మాత్రమే. ఆలోచన ప్రేమకు దారి తీయదు. ఆలోచన ప్రేమను పెంపొందించదు. ప్రేమ అనేదాన్ని తోటలో మొక్కలా పెంచటానికి వీలుకాదు. ప్రేమను పెంపొందించుకోవాలనే కోరిక కూడా ఆలోచనా ప్రక్రియే.

మీకు తెలుసునో లేదో, మీ జీవితంలో ఆలోచనకి ఎంత ప్రముఖమైన పాత్ర ఉన్నదో మీరే చూస్తారు. ఆలోచనకి దానికుండవలసిన స్థానం దానికుంది. కాని, దానికీ ప్రేమకీ ఏ సంబంధమూ లేదు. ఆలోచనకి సంబంధించిన దానిని ఆలోచనతో అర్థం చేసుకోవచ్చు. కాని ఆలోచనతో సంబంధం లేనిదాన్ని మనస్సుతో పట్టుకోవటం సాధ్యం కాదు. అయితే, ప్రేమంటే ఏమిటి అని అడుగుతారు మీరు. ప్రేమ ఉండే స్థితిలో ఆలోచన ఉండదు. కాని ప్రేమకు నిర్వచనం కూడా ఆలోచించే చెప్పాలి. అందుచేత ఆ నిర్వచనం కూడా ప్రేమ కాదు.