పుట:Mana-Jeevithalu.pdf/22

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
13
ఏకాంతం, ఒంటరితనం

ఈ ఏకాంతం బాధ కలిగించటం లేదు. ఒంటరితనం భయంకరంగా లేదు. ఇది ఏకాంతంగా ఉండటం. కల్మషం లేకుండా, సమృద్ధిగా, సంపూర్ణంగా ఉంది. ఆ చింతచెట్టు అక్కడ అలాగే ఉండటమే గాని దానికి వేరే జీవనం ఏమీలేదు. ఇదే కదా ఏకాంతం. నిప్పులాగ, పువ్వులాగ ఏకాంతంగా ఉండటం. అందులో ఉన్న పవిత్రతనీ, గంభీరతనీ తెలుసుకోలేరు. ఏకాంతం ఉన్నప్పుడే ఏదైనా తెలుసుకోగలుగుతారు. ఏకాంతంగా ఉండటం అంటే అన్నిటినీ త్రోసిపుచ్చి తన చుట్టూ గూడు కట్టుకుని కూర్చోవటం కాదు. అన్ని ఉద్దేశాలనీ, కోరికలు తీర్చుకునేందుకు చేసే అన్ని ప్రయత్నాలనీ, అన్ని లక్ష్యాలనీ ప్రక్షాళనం చేసుకోవటమే ఏకాంతం అంటే. మనస్సు యొక్క అంతిమ లక్ష్యం కాదు ఏకాంతం. ఏకాంతం కోరుకుంటే వచ్చేది కాదు. ఆ విధమైన కోరిక కేవలం తెలుసుకోవటం చేత కాక, ఆ చేతకాని తనం కల్పించే బాధని తప్పించుకునే మార్గం మాత్రమే.

భయమూ బాధతో కూడిన ఒంటరితనం అంటే ఒక్కరూ ఒంటరిగా మిగిలిపోవడం. స్వార్థంతో చేసే పనులవల్ల కలిగే అనివార్య ఫలితం అది. ఒంటరితనం పరిమాణంలో పెద్దదైనా, చిన్నదయినా గందరగోళం, సంఘర్షణ, దు:ఖం ఎదురవుతాయి. ఒంటరితనంలోంచి ఏకాంతం ఉద్భవించదు. ఒంటరితనం పోతేగాని ఏకాంతం లభించదు. ఏకాంతం అవిభాజ్యమైనది. ఒంటరితనం అంటే ఎడబాటు. ఏకాంతంగా ఉన్నదాంట్లో మార్దవం, ఎంతో సహనం ఉంటాయి. ఏకాంతంగా ఉండేవారే కారణరహితమైన దానితో, అపరిమితమైన దానితో భాషించగలుగుతారు. ఏకాంతంగా ఉన్నదానికి జీవితం అనంతమైనదిగా ఉంటుంది. ఏకాంతంగా ఉన్నదానికి మృత్యువు ఉండదు. ఏకాంతంగా ఉన్నది గతించలేదు.

చంద్రుడు ఇప్పుడిప్పుడే చెట్ల పైకి వస్తున్నాడు. నీడలు దట్టంగా, నల్లగా పడుతున్నాయి. మేము ఆ చిన్న గ్రామందాటి తిరిగి నది పక్కనుంచి నడిచి వెళుతుంటే ఒక కుక్క మొరగటం మొదలుపెట్టింది. నది ఎంత నిశ్చలంగా ఉందంటే, నక్షత్రాలూ, వంతెన మీద ఉన్న దీపాలూ అందులో స్పష్టంగా తేలుతున్నాయి. ఒడ్డు మీద దూరాన పిల్లలు కొందరు నిలబడి నవ్వుతున్నారు. ఒక చంటిపిల్ల ఏడుస్తోంది. చేపలు పట్టేవాళ్ళు వలలన్నీ శుభ్రం చేసుకొని చుట్ట