పుట:Mana-Jeevithalu.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేతన, అంతశ్చేతన

171

దానికి నిశ్చితాభిప్రాయాలు మాత్రమే తెలుసును - అవి సంతోషకరమైనవి గానీ, సంతోషకరం కానివి గానీ, ఉన్న వాటికి మరికొన్ని నిర్ణయాలనూ, అభిప్రాయాలనూ, మార్పులేని స్థిరపడిన అభిప్రాయాలు మరికొన్నిటినీ చేర్చుకోగలదంతే. ఏ నిర్ణయమైనా స్థిరపడిన అభిప్రాయమే. వ్యక్తంగా ఉన్న చేతన మనస్సు తప్పని సరిగా నిర్ణయాన్ని కోరుతుంది.

సంతృప్తికరమైన నిర్ణయాన్ని కనుక్కోలేకపోయినప్పుడు చేతన మనస్సు వెతకటం మానేస్తుంది. స్తిమితంగా ఉంటుంది. అంతశ్చేతన హఠాత్తుగా ఒక పరిష్కారాన్ని ఈ స్తిమితంగా ఉన్న చేతనకు సూచిస్తుంది. ఇప్పుడు అవ్యక్తంగా ఉన్న లోపలి మనస్సుకి, వ్యక్తంగా ఉన్న మనస్సుకి నిర్మాణంలో ఏదైనా తేడా ఉన్నదా? అవ్యక్తంగా ఉన్న మనస్సు కూడా జాతి గురించీ, వర్గం గురించీ, సంఘం గురించీ ఏర్పడిన నిశ్చితాభిప్రాయాలూ, జ్ఞాపకాలూ కలిసి నిర్మితమైనది కాదా? నిజానికి, అవ్యక్తంగా ఉన్న మనస్సు కూడా గతం ఫలితమే. ఎటొచ్చీ, అది కనిపించకుండా నిరీక్షిస్తూ ఉంది అంతే. అవసరమైన వెంటనే తన నిగూఢ నిశ్చితాభిప్రాయాలను బయట పెడుతుంది. అవి సంతృప్తికరంగా ఉంటే పై మనస్సు వాటిని స్వీకరిస్తుంది. లేని పక్షంలో గిజగిజలాడుతూ, ఒక అద్భుతం జరిగి, సమస్యకు పరిష్కారం జరుగుతుందని ఆశపడుతుంది. పరిష్కారం దొరక్కపోతే విసుక్కుంటూ ఆ సమస్యని భరిస్తుంది. ఇది క్రమంగా మనస్సుని తినేస్తుంది. దాంతో రోగం, మతి భ్రమణం మొదలవుతాయి.

పై మనస్సూ, లోపలి మనస్సూ పోలిక లేకుండా ఉండవు. అవి రెండూ కూడా నిశ్చితాభిప్రాయాలతోనూ, జ్ఞాపకాలతోనూ తయారైనవే. రెండూ గతం నుంచి ఏర్పడినవే. పై మనస్సూ, లోపలి మనస్సూ - రెండూ నిశ్శబ్దంగా ఉండి అనుకూలమైనవి గాని ప్రతికూలమైనవిగాని అయిన నిశ్చితాభిప్రాయాలను ప్రదర్శించకుండా ఉంటేనే సమస్య అంతమొందుతుంది. మనస్సంతా పూర్తిగా నిశ్చలంగా ఉండి, సమస్యని ఇష్టాయిష్టాలు లేకుండా తెలుసుకున్నప్పుడు సమస్యనుంచి విముక్తి లభిస్తుంది. అప్పుడే సమస్యని సృష్టించే ఆ స్థితి ఉండదు.