పుట:Mana-Jeevithalu.pdf/181

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


55. సమస్య, ప్రతిక్రియ (సవాలు చేయడం, సమాధానం)

నది నిండుగా, విసురుగా ఉంది. కొన్ని చోట్ల కొన్ని మైళ్ల వెడల్పులో ఉంది. అంత నీటిని చూడటం ఆనందదాయకంగా ఉంది. ఉత్తరం వైపు పచ్చని కొండలు తుఫాను తరవాత స్వచ్ఛంగా ఉన్నాయి. నదిలో ఆ పెద్ద వంపునీ, దానిమీద తెల్లని తెరచాపలతో ఉన్న పడవల్నీ చూడటం అద్భుతంగా ఉంది.

పడవలు పెద్దగా, ముక్కోణాకారంలో ఉన్నాయి. ఆ ఉదయారుణ కాంతిలో అవి రమణీయంగా కనిపిస్తున్నాయి - అవి ఆ నీటిలోంచే వచ్చాయా అన్నట్లు. పగటి చప్పుళ్లు ఇంకా మొదలవలేదు. పడవవాని పాట దరిదాపు అవతలి తీరం నుంచి నీటిమీద తేలుతూ వస్తోంది. అ సమయంలో అతని పాటతో అవని అంతా నిండినట్లుగా అనిపించింది. అన్ని శబ్దాలూ నిశ్శబ్దమై పోయాయి. రైలు కూత కూడా మృదువుగానూ, వినసొంపుగానూ అయింది.

క్రమంగా ఊళ్లో చప్పుళ్లు ప్రారంభమయాయి. కుళాయి దగ్గర తగువులూ, గొర్రెల అరుపులూ ఆవులు పాలు పిండమని పిలవటం, వీధిలో పోయే బరువైన బళ్లూ, కాకుల కూతలూ, పిల్లల కేకలూ, నవ్వులూ - మరోరోజు పుట్టింది. సూర్యుడు కొబ్బరి చెట్లమీద ఉన్నాడు. కోతులు గోడ మీద కూర్చున్నాయి. వాటి పొడుగాటి తోకలు భూమిని అంటేలా ఉన్నాయి. అవి పెద్దవే గాని పిరికివి. వాటిని పిలిస్తే నేల మీదికి గెంతి, పొలంలోని పెద్ద చెట్లు మీదికి పారిపోయాయి. వాటి ముఖాలూ, పంజాలూ నల్లగా ఉన్నాయి. చాలా తెలివైనవిలా ఉన్నాయి. కాని, గడుసుతనం, అల్లరీలేదు చిన్నవాటికున్నట్లు.

"ఆలోచన అదేపనిగా ఎందుకుంటుంది? విరామమెరుగనట్లుగా, విసుగు పుట్టించేలా వదలకుండా ఉంటుంది. మీరేం చేసినా సరే, అది పనిచేస్తూనే ఉంటుంది. ఆ కోతుల్లాగ. దాని కార్యకలాపం అలిసిపోయేలా చేస్తుంది. దాన్నుంచి తప్పించుకోలేరు. అవిరామంగా మీ వెంట పడుతుంది. దాన్ని అణచివెయ్యటానికి ప్రయత్నించండి. కొద్ది క్షణాల్లో మళ్లీ తలెత్తుతుంది. ఎప్పుడూ శాంతంగా ఉండదు. ఎప్పుడూ విశ్రాంతి తీసుకున్నట్లుండదు. ఎప్పుడూ దేని వెంటో పడుతుంది. ఎప్పుడూ విశ్లేషిస్తూనే ఉంటుంది. ఎప్పుడూ