పుట:Mana-Jeevithalu.pdf/179

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
170
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

వ్యక్తంగా ఉన్నది వేరునా? అవి పోలిక లేనివా? ఒకటి భగ్నమైతే రెండవది పనిచెయ్యటం మొదలు పెడుతుందా?

మనం 'వ్యక్తంగా ఉన్నది' లేదా 'చేతన' అనేదేమిటి? అది దేనితో తయారైనదో అర్థం చేసుకోవటానికి, ఏదైనా సమస్యని మనం సచేతనంగా ఎలా సమీపిస్తామో గమనించాలి. మనలో చాలామంది సమస్యకి పరిష్కారం వెతకటం కోసం ప్రయత్నిస్తారు. మనం పరిష్కారం గురించి ఆలోచిస్తాం, సమస్య గురించి కాదు. సమస్యని పరిష్కారం ద్వారా తప్పించుకోవాలని కోరుకుంటాం. సమస్యని యథాతథంగా గమనించం, కాని, సంతృప్తికరమైన జవాబు కోసం తడుముకుంటాం. మన చేతనంలో మన ఆలోచన అంతా పరిష్కారాన్ని, సంతృప్తికరమైన నిర్ణయాన్ని వెతకటం గురించే. తరుచు మనకి తృప్తి కలిగించే పరిష్కారాన్ని కనుక్కుంటాం. ఆ తరవాత సమస్యని పరిష్కరించేశామనుకుంటాం. మనం నిజానికి చేసేదేమిటంటే, సమస్యని ఒక నిర్ణయంతో, ఒక సంతృప్తికరమైన పరిష్కారంతో కప్పిపెట్టి ఉంచుతాం. ఆ నిర్ణయం బరువు క్రింద తాత్కాలికంగా ఊపిరి సలపకుండా అణచిపెట్టి ఉన్నప్పటికీ, ఆ సమస్య ఇంకా అలానే ఉంటుంది. పరిష్కారం కోసం వెతకటం సమస్యని తప్పించుకోవటమే. తృప్తికరమైన పరిష్కారం లేనప్పుడు వ్యక్తంగా ఉన్న పైపై మనస్సు వెతకటం మానేస్తుంది. అప్పుడు అవ్యక్తంగా ఉన్నదనబడే లోలోపలి మనస్సు అందిపుచ్చుకుని పరిష్కారాన్ని కనుక్కుంటుంది.

వ్యక్తంగా ఉన్న మనస్సు సమస్యని తప్పించుకోవటానికి మార్గం వెతుకుతుందనీ, తృప్తికరమైన నిర్ణయమే ఆ తప్పించుకునే మార్గం అనీ స్పష్టమవుతోంది. వ్యక్తంగా లేదా చేతనంగా ఉన్న మనస్సు నిర్ణయాలతో తయారైనదే కదా - ఆ నిర్ణయాలు అనుకూలమైనవి గాని, ప్రతికూలమైనవి గాని. వేరొకటి వెతకటం దానికి చేతనవునా? అనుభవాలవల్లా, గతించిన వాటి ప్రభావం వల్లా ఏర్పడిన నిశ్చితాభిప్రాయాలకు ఆటపట్టు కాదా. పైపై మనస్సు? నిజానికి, వ్యక్తంగా ఉన్న మనస్సు గతంతో తయారైనదీ, గతంమీద ఆధారపడినదీ - ఎందువల్లనంటే, జ్ఞాపకమే నిశ్చితాభిప్రాయాలతో వేయబడినది. ఈ నిశ్చితాభిప్రాయాలతో మనస్సు సమస్యని సమీపిస్తుంది. సమస్యని ఆ నిశ్చితాభిప్రాయల తెర లేకుండా చూడటం చేతకాదు దానికి.