పుట:Mana-Jeevithalu.pdf/132

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
123
ఎరుక

సమస్యని సృష్టిస్తుంది. మీ విముక్తికోసం, స్వీయ విస్మరణ కోసం, ఆనందం కోసం తాగుడు మీదో, గురువు మీదో ఆధారపడితే అదే మీ సమస్య అవుతుంది. పరాధీనత, సొంతం చేసుకోవాలనే ఇచ్ఛనీ, ఈర్ష్యనీ, భయాన్నీ పెంపొందింపజేస్తుంది. అప్పుడు భయం, దాన్ని ఎలా తప్పించుకోవటం అన్నది మీ తీవ్ర సమస్య అవుతుంది. ఆనందాన్ని అన్వేషించటంలో సమస్యను మనమే సృష్టించుకుని అందులో చిక్కుకుంటాం. లైంగికానుభవంతో మనల్ని మరచిపోవటంలో కొంత ఆనందాన్ని చవిచూస్తాం. దాన్ని మన కోరికను సాధించుకోవటానికి సాధనంగా ఉపయోగిస్తాం. దేనివల్ల ఆనందం కలుగుతుందో అది తప్పనిసరిగా సంఘర్షణ పుట్టిస్తుంది - ఆనందం కన్న దాని సాధనమే ఎంతో ఎక్కువ అర్ధవంతం, ముఖ్యం అనుకుంటాం కాబట్టి. ఆ కుర్చీ అందం వల్ల నాకు ఆనందం కలిగితే ఆ కుర్చీ నాకు అత్యంత ముఖ్యమై పోతుంది. దాన్ని నేను అన్నిటి నుంచీ రక్షించుకోవాలి. 'నేను' అన్న ప్రత్యేకత కోసం ప్రయత్నించడం లేదా? నేనే ఆనందంగా ఉండాలనే అనుకోవడం లేదా? ఈ పోరాటంలో, ఒకప్పుడు ఆ కుర్చీ అందం వల్ల నేను పొందిన ఆనందాన్ని పూర్తిగా మరిచిపోతాను. నాకు కుర్చీయే మిగులుతుంది. కుర్చీ దానంతట అది విలువైనది కాదు. నేను దానికి అసాధారణమైన విలువ నిచ్చాను - అది నా ఆనందానికి సాధనం కనుక. అందువల్ల ఆనందానికి ఒక ప్రత్యామ్నాయం సాధనం అవుతోంది.

జీవించే ఒక మనిషి నా ఆనందానికి సాధనం అయినప్పుడు ఆ సంఘర్షణ, గందరగోళం, వైరుధ్యం, బాధా మరింత ఎక్కువగా ఉంటాయి. సంబంధం ఉపయోగం మీద ఆధారపడి ఉన్నప్పుడు మరీ పైపైన తప్పితే అసలు సంబంధం అనేది ఉంటుందా ఉపయోగించుకునే వారికీ, ఉపయోగింపబడే వారికీ మధ్య? మిమ్మల్ని నా కోసం ఉపయోగించుకుంటే మీతో నాకు సంబంధం ఉన్నట్లేనా? సంబంధం అంటే వివిధ స్థాయిల్లో పరస్పర సన్నిహిత సంపర్కం ఉండటం. ఇంకొకరు సాధనం మాత్రమే అయితే, ఆనందానికి ఒక మార్గం మాత్రమే అయితే, అతనితో సన్నిహిత సంపర్కం ఉంటుందా? ఆ విధంగా ఒకరిని ఉపయోగించుకోవటంలో స్వీయ ప్రత్యేకత కోసం ప్రయత్నించడం లేదా? 'నేనే' ఆనందంగా ఉండాలని