పుట:Mana-Jeevithalu.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

భౌతిక ప్రకృతికి అతీతమైన వాటిని దర్శించగలిగాడుట. అయితే, అవన్నీ తన ఊహా జనితాలు కావచ్చునని ఆయనే అన్నాడు మళ్లీ. కాని, అలాటివై ఉండవని తను అభిప్రాయ పడుతున్నానన్నాడు. ఏమయినప్పటికీ, ఆయన అంత విస్తృతంగా చదివినవాడయినప్పటికీ, ఎంతో తెలిసిన వాళ్లెందరితోనో చర్చించి ఉన్నప్పటికీ, మరణించిన వారి భౌతిక దేహాలను నిస్సంశయంగా చూసి ఉన్నప్పటికీ, అసలు నిజం అర్థమైందనుకుని ఇంతవరకు తృప్తి పడలేకపోతున్నాడుట. నమ్మకం గురించీ, నమ్మకం లేకపోవటం గురించీ ఎంతో గంభీరంగా చర్చించాడు. ఆయన స్నేహితుల్లో - మరణానంతరం ఏదో ఇంకా కొనసాగుతూనే ఉంటుందని నమ్మేవాళ్లు కొందరున్నారుట, మరణంతో ఈ భౌతికదేహంతో బాటు జీవితంకూడా అంతమైపోతుందనీ, ఆ తరవాత ఇంకేమీ ఉండదనీ నమ్మేవాళ్లూ ఉన్నారుట. ఆధ్యాత్మిక విషయాల్లో ఎంతో జ్ఞానమూ, అనుభవమూ సంపాదించినప్పటికీ ఇంకా మనస్సులో కొంత సందేహం మిగిలిపోయిందిట. వయస్సు పైబడుతున్నందువల్ల నిజం ఏమిటో తెలుసుకోవాలని కోరుతున్నారుట. ఆయనకి మరణం అంటే భయం లేదుట. కాని, దాని గురించి నిజం తెలియాలిట.

రైలు ఆగింది. అప్పుడే రెండు చక్రాల గుర్రపుబండి ఒకటి అటువైపు నుంచి పోతోంది. ఆ బండి మీద ఒక శవం ఉంది. కోరారంగు బట్టలో చుట్టి ఉంది. అప్పుడే కోసిన పచ్చని పొడుగాటి వెదురుబొంగులు రెండింటిపైన వేసి కట్టి ఉంది. ఏదో గ్రామం నుంచి నదికి తీసుకువెడుతున్నారు - దహనం చేయటానికి. ఆ గతుకుల బాట మీద బండిపోతూంటే శవం అదిరి పడుతోంది. బట్ట క్రింద ఉన్న తలకి సహజంగా మరీ ఎక్కువగా తగుల్తోంది కుదుపు. బండితోలే వాడుకాక, ఆ బండిలో మరొక మనిషి ఉన్నాడంతే. ఎవరో దగ్గర బంధువై ఉంటాడు. బాగా ఏడ్చిన మీదట కళ్లు ఎర్రబడ్డాయి. వసంతకాలం ప్రారంభమైంది. ఆకాశం లేత నీలంరంగులో ఉంది. పిల్లలు దారిలో మట్టిలో ఆడుకుంటున్నారు. చావు సామాన్యంగా కనిపించే దృశ్యమేనేమో. ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. మరణం గురించి ప్రశ్నిస్తున్నాయన కూడా ఆ బండినీ, అది మోస్తున్న దాన్నీ గమనించలేదు!

నమ్మకం అనుభవాన్ని ప్రభావితం చేస్తుంది. అటుపైన అనుభవం