పుట:Mana-Jeevithalu.pdf/114

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వస్తువునీ, సంబంధాన్నీ శాశ్వతం చేసుకోవాలని ప్రయత్నిస్తాం. అది కూడా అసంభవం కాబట్టే అనుభవించేది అనే శాశ్వతమైన అంశాన్ని సృష్టిస్తాం. "నేను" అనేదాన్ని కోరిక నుంచి వేరు చేస్తాం. ఆలోచించే దాన్నీ, ఆలోచననీ వేరు చేస్తాం. ఈ విభేదం నిజానికి అసత్యమైనది. ఇది భ్రమకి దారితీస్తుంది.

శాశ్వతత్వాన్ని కోరటం స్వీయ సాఫల్యం కోసం అనంతంగా ఆక్రోశించటమే. ఆత్మ ఎప్పుడూ సాఫల్యం పొందలేదు. ఆత్మ అశాశ్వతమైనది. దేనిలో అది సాఫల్యాన్ని కోరుకుంటున్నదో అది కూడా అశాశ్వతమైనదే అవుతుంది. ఆత్మ అదేవిధంగా కొనసాగితే అది వినాశమే. ఎందువల్లనంటే, అందులో పరివర్తన చెందే అంశంగాని, కొత్త ఊపిరి గాని ఉండదు. కొత్తది సృష్టింపబడాలంటే ఆత్మ అంతమొంది తీరాలి. ఆత్మ అనేది ఒక ఊహ. ఒక నమూనా, ఒక జ్ఞాపకాల మూట - సాఫల్యాన్ని కోరే ప్రతి ఊహనీ, అనుభవాన్నీ మరికొంత వరకు కొనసాగించటమే. అనుభవం ఎప్పుడూ పరిమితం చేస్తుంది. అనుభవించేది ఎప్పుడూ అనుభవం తన్ను తాను విడదీసుకుంటూ, వేరుచేసుకుంటూ ఉంటుంది. అందుచేత అనుభవం నుంచీ, అనుభవం పొందాలనే కోరిక నుంచీ స్వేచ్ఛ లభించాలి. అంతర్గతమైన దారిద్ర్యాన్ని శూన్యతనీ కప్పిపుచ్చే మార్గమే సాఫల్యం. సాఫల్యంలో దుఃఖము, బాధా ఉంటాయి.


38. కొనసాగించటం.

ఎదురుగుండా ఉన్న సీటులో కూర్చున్నాయన తన్ను తాను పరిచయం చేసుకున్నాడు - ఏవో ప్రశ్నలడగాలనే ఉద్దేశంతో. మరణం గురించీ, మరణం తరువాత రాబోయే దాన్ని గురించీ ప్రతి మంచి పుస్తకాన్నీ - ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకూ వచ్చిన పుస్తకాలన్నిటినీ చదివానని చెప్పారాయన. ఆయన భౌతిక విజ్ఞానశాస్త్ర పరిశోధనా సంఘంలో సభ్యుడుగా ఉండేవాడుట. ఎన్నో ప్రశస్తమైన, ప్రతిష్ఠాకరమైన సమావేశాల్లో పాల్గొన్నాడుట. ఆధ్యాత్మిక ప్రదర్శనలనెన్నిటినో, నిజమైన వాటినే దర్శించాడుట. ఆయన ఈ విషయమై ఎంతో తీవ్రంగా ఆలోచించటం వల్ల అనేక సార్లు స్వయంగా