పుట:Mana-Jeevithalu.pdf/111

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
102
మన జీవితాలు - జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు.

తిరస్కరించి భ్రమలను పట్టుకోవటం వల్లనే మనం భయపడుతూ ఉంటాం. భ్రమలో అంతకంతకి లోతుకి కూరుకుపోవటం, మనల్ని బంధించిన బోనుని ముస్తాబు చేయడమూ ధ్యానం కాదు. భ్రమని పెంపొందించే మనో మార్గాలలో దేనివైపూ మొగ్గకుండా, తెలుసుకోగలగటమే ధ్యానానికి ఆరంభం.

నిజమైన దాని స్థానంలో మరొక దాన్ని సులభంగా పెట్టేసి, దానితోనే మనం తృప్తిపడటం చిత్రమైన విషయం. సంకేతం, మాట, కల్పన ఎంతో ముఖ్యమైపోతాయి. ఈ సంకేతం చుట్టూ ఆత్మవంచన అనే కట్టడాన్ని నిర్మిస్తాం. దానికి బలం చేకూర్చటానికి జ్ఞానాన్ని వినియోగిస్తాం. అందుకే నిజాన్ని అవగాహన చేసుకోకుండా అనుభవం అడ్డుపడుతుంది. తెలియ జేయటానికే కాకుండా, అనుభవానికి శక్తి సమకూర్చటానికి కూడా నామకరణం చేస్తాం. అనుభవానికి శక్తినివ్వటం ఆత్మని చైతన్యంగా చేసుకోవటమే. ఒకసారి ఆ ప్రక్రియలో చిక్కుకుంటే దాన్ని వదలటం కష్టం. ఆత్మ చైతన్యాన్ని తప్పించుకోవటం కష్టం. నిన్నటి అనుభవాలనూ, నేటి అనుభూతులనూ వదిలివేయటం అవసరం. లేనట్లయితే పునశ్చరణం అవుతుంది. ఒక చర్యని గాని, ఒక పూజని గాని, ఒక శబ్దాన్ని గాని పునశ్చరణ చేయటం వృథా పునశ్చరణలో పునఃసృష్టి ఉండదు. అనుభవం గతించిపోవటమే సృష్టి.


37. ఊహ, యథార్థం

ఆవిడకి వివాహం అయి చాలా ఏళ్లయింది. కాని, పిల్లలేరు. ఆవిడకి పిల్లలు పుట్టలేదుట. ఆ యథార్థం ఆవిణ్ణి తీవ్రంగా కలచివేసింది. ఆవిడ అక్కచెల్లెళ్లకి పిల్లలున్నారుట. తనకే ఎందుకా శాపం? ఆవిడకి చిన్నప్పుడే వివాహం అయిందట - ఆనాటి ఆచారం ప్రకారం. ఆవిడ ఎన్నో బాధలు పడిందట. ఏదో కొంత ఆనందాన్ని కూడ అనుభవించిందిట. ఆవిడ భర్త పెద్ద ఉద్యోగి ఏదో కార్పొరేషన్‌లోనో ప్రభుత్వశాఖలోనో; వాళ్లకి పిల్లలేరన్న విషయానికి ఆయనా బాధపడ్డాడుట. కాని, ఆ యథార్థంతో ఆయన సమాధాన పడుతున్నట్లు కనిపిస్తోందిట. అదీ కాక, ఆయనకి తీరుబడి లేనంత వ్యాపకం, అన్నదావిడ. ఆయన మీద ఆవిడకి ఆధిపత్యం ఉన్నట్లు - మరీ ఎక్కువ